శ్రీ విజయపురం: అండమాన్లో సముద్రంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. అధికారులు వెంటనే స్పందించి హెలికాప్టర్‌లో ఉన్న అందరినీ రక్షించారు. మంగళవారం అండమాన్ జిల్లాలోని రంగట్ నుంచి బయలుదేరిన పవన్ హన్స్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది.
మాయాబుందర్‌లో ల్యాండ్ కావడానికి ముందు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం, పోలీసులు, అటవీ సిబ్బంది, కోస్ట్ గార్డ్ వెంటనే స్పాట్‌కు వెళ్లి ఐదుగురు వ్యక్తులను రక్షించారు. వెంటనే వారందరినీ మాయాబుందర్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్టు ఓ అధికారి తెలిపారు.
ప్రాథమిక విచారణలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్టు తేలిందని.. దీంతో పైలట్ దానిని సముద్రంలో క్రాష్ -ల్యాండ్ చేశాడని సీనియర్ పౌర విమానయాన అధికారి తెలిపారు. దీనిపై విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారిని రజితా దేవి, కమలా చంద్ర దాస్, శిప్రా సాహా, నంబి అమ్మ, ఇద్దరు పైలట్లు, కెప్టెన్ అనిల్ ఝా, కెప్టెన్ టీపీఎస్ గులియాగా గుర్తించారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
