కేసీఆర్‌తో నేను మాట్లాడతా: పవన్

కేసీఆర్‌తో నేను మాట్లాడతా: పవన్
  • ప్రత్యేక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరం: పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌
  • ప్రభుత్వానికి  పట్టు విడుపు ఉండాలె
  • కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: పవన్‌‌‌‌
  • మిలియన్‌‌‌‌ మార్చ్‌‌‌‌కి మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌‌‌‌తో మాట్లాడుతానని జనసేన అధ్యక్షుడు పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ అన్నారు. ప్రభుత్వానికి పట్టు విడుపు ఉండాలని, సీఎం ఎందుకు కోపంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం హైదరాబాద్‌‌‌‌లో పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ను కలిసి మిలియన్‌‌‌‌ మార్చ్‌‌‌‌కు మద్దతివ్వాలని కోరారు. 27 రోజులుగా సమ్మె జరుగుతున్న తీరు, డిమాండ్లను పవన్‌‌‌‌కు వివరించారు. అనంతరం పవన్‌‌‌‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటం మర్చిపోలేనిదన్నారు. 2వ తేదీలోపు కేసీఆర్‌‌‌‌ అపాయింట్‌‌‌‌మెంట్ కోరతానని, కార్మికులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని అడుగుతానన్నారు. ఒకవేళ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వకుంటే ఆలోచిస్తానని చెప్పారు. మంత్రులు కేటీఆర్‌‌‌‌, హరీశ్ రావు, ఎంపీ కేశవరావును కూడా కలుస్తానని పవన్‌‌‌‌ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుంటుందని, సీఎం కేసీఆర్‌‌‌‌ 48 వేల మంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వేల కుటుంబాలు బాధ, ఆకలితో ఉండడం ఎవరికీ మంచిదికాదన్నారు. కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. టీడీపీ హయాంలో జరిగిన బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ కాల్పుల ఘటన ఎంత కలచివేసిందో.. ఇప్పుడూ అటువంటే బాధే కలుగుతోందన్నారు. మిలియన్ మార్చ్‌‌‌‌కు మద్దతివ్వాలని జేఏసీ నాయకులు కోరారని, ఈ లోపు ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే విషయంపై ఆలోచిస్తానని చెప్పారు.

పవన్‌‌‌‌ మద్దతు ఇస్తామన్నరు: అశ్వత్థామ రెడ్డి

చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే తమ పోరాటానికి మద్దతిస్తానని పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ చెప్పారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌‌‌‌ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఉద్యమం టైంలో తమతో ఉన్న మంత్రులెవరూ ఇప్పుడు మాట్లాడడం లేదని, కానీ పవన్‌‌‌‌  పాజిటివ్‌‌‌‌గా స్పందించారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్‌‌‌‌ అన్న మాటలను పవన్‌‌‌‌ గుర్తు చేశారన్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయాన్నీ పవన్‌‌‌‌ ప్రస్తావించినట్టు చెప్పారు. సమ్మెకు మద్దతు తెలిపినందుకు పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.