IPLపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మే 11న జరగనున్న పంజాబ్, ముంబై మ్యాచ్ వేదిక మార్పు

IPLపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మే 11న జరగనున్న పంజాబ్, ముంబై మ్యాచ్ వేదిక మార్పు

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్‎పై పడింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆపరేషన్‎ సిందూర్‎కి కౌంటర్‎గా పాక్ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయ్యింది. ఈ మేరకు పాక్ సరిహద్దు రాష్ట్రా్ల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ పోర్టులు మూసివేశారు. ఇందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్‎లోని కాంగ్రా ఎయిర్ పోర్టును క్లోజ్ చేశారు. 

ఈ ప్రభావంతో 2025, మే 11న హిమాచల్ ప్రదేశ్‎లోని ధర్మశాల స్టేడియం వేదికగా జరగాల్సిన పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్ వేదిక మార్చింది బీసీసీఐ. ఈ మ్యాచ్‎ను ధర్మశాల నుంచి గుజరాత్‎లోని అహ్మదాబాద్‎కు షిప్ట్ చేసింది. బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ వేదిక మార్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ముంబై, పంజాబ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ సీజన్‎లో పంజాబ్ తమ సెకండ్ హోం గ్రౌండ్‎గా ధర్మశాలను ఎంచుకున్న విషయం తెలిసిందే. 

ALSO READ | PBKS vs DC ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్ : ధర్మశాలలో వర్షం పడుతుందా.. మ్యాచ్ జరుగుతుందా..?

ఇక, గురువారం (మే 8) ధర్మశాల స్టేడియం వేదికగా జరగనున్న ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. బార్డర్‎లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‎కి హాజరయ్యే ప్రేక్షకులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి స్టేడియం లోపలికి పంపనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్టేడియం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కాంగ్రా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లు రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.