ముందు స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించు.. బండి సంజయ్‎కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్

ముందు స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించు.. బండి సంజయ్‎కు పీసీసీ చీఫ్  మహేశ్  గౌడ్ సవాల్
  • బీజేపీకి ఘోర ఓటమి తప్పదు.. రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు
  • యూరియా తెప్పించలేని నువ్వో కేంద్రమంత్రివా?
  • హోంశాఖ చూస్తూ రోహింగ్యాలు చొరబడుతున్నారని చెప్తావా?
  • ముస్లింలను సాకుగా చూపి బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకుంటావా?
  • నువ్వు రాష్ట్రానికి చేసిందేమిటి?
  • కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధంగా ఉండాలని కామెంట్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల దాకా ఎందుకని, స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకి ఘోర పరాజయం తప్పదని, రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కౌంటర్​ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజలివ్వనున్న తీర్పుతో మీకు రాజకీయ సన్యాసం, మఠంలో స్థిర నివాసం ఖాయం’ అన్నారు. 

యూరియా కొరతతో తెలంగాణ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడలేని నువ్వో కేంద్ర మంత్రివా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు, కరీంనగర్ కు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చావని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి గాని, వేములవాడ రాజా రాజేశ్వర దేవాలయ అభివృద్ధి కి ఒక్క పైసా అయినా ఇచ్చారా అని నిలదీశారు.

 కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులో అన్యాయం జరగుతోందని తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక సమస్యలను బండి సంజయ్​ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో 12 ఏండ్ల బీజేపీ పాలన.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధంగాఉండాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం అన్యాయం చేస్తున్నా.. బీసీ బిడ్డగా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. 

ముస్లింలను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని, అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఎందుకు ఉన్నారంటే సమాధానం చెప్పడం లేదన్నారు. ‘అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే తప్పులేదు.. ఇక్కడిస్తే తప్పా? ముస్లింలలో పేదలు లేరా? వారికి న్యాయం జరగకూడదా?’ అని నిలదీశారు. 

12 ఏండ్ల బీజేపీ పాలనలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలని, అందులో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చర్చించేందుకు సిద్ధమన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉండి రోహింగ్యాలు అక్రమంగా వస్తున్నారని మాట్లాడితే ఎలా అన్నారు. ‘నువ్వింకా కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నావని గుర్తుంచుకో’ అని చురక అంటించారు.