- కుటుంబ సమస్యలతో కేసీఆర్ సతమతం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. కన్నబిడ్డ కవిత అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ 50 ఏండ్లు వెనక్కు వెళ్లిందని ఆరోపించారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శిక్షణ శిబిరానికి మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సేవాదళ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు ఇప్పుడు బీఆర్‌ఎస్ ను ఆదరించే పరిస్థితి లేదన్నారు.
ఆ పార్టీ ఇప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయకుండా మళ్లీ అధికారంలోకి ఎట్ల రావాలనే ఆత్రుతలో ఉందన్నారు. కుటుంబ సమస్యలతోనే కేసీఆర్ సతమతమవుతున్నారని విమర్శించారు. ఇక బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సేవాదళ్ దేశ స్వతంత్ర పోరాటం నుంచి కొనసాగుతుందని, దేశంలో బీజేపీ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో సేవాదళ్ ముందుందని అన్నారు.

