నోటీస్ ఇవ్వకుండా ఒక్క ఓటూ తీసేయొద్దు... ‘సర్’ పేరిట సెక్యులర్ల ఓట్లను తొలగించకుండా చూడండి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నోటీస్ ఇవ్వకుండా ఒక్క ఓటూ తీసేయొద్దు... ‘సర్’ పేరిట సెక్యులర్ల ఓట్లను తొలగించకుండా చూడండి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి  
  • తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు 
  • రాష్ట్రంలో సర్ ప్రక్రియను ఏడాది పాటు కొనసాగించాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పేరిట తెలంగాణలో సెక్యులర్ల ఓట్లను తొలగించకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డికి పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. నోటీసు ఇవ్వకుండా ఒక్క ఓటూ తొలగించొద్దని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈవోను పీసీసీ చీఫ్ కలిసి పలు విషయాలపై చర్చించారు. అక్రమంగా, అన్యాయంగా అర్హుల ఓట్లను తొలగించకుండా పలుసూచనలు చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  దేశంలో 14 రాష్ట్రాల్లో ఓట్ల చోరి జరిగిందని, పశ్చిమ బెంగాల్ లో ఈ ఓట్ చోరితోనే అక్కడ అధికారంలోకి రావాల్సిన టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఓడిపోయారన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్రంలోని మరో ఆరుగురు బీజేపీ ఎంపీలు ఓట్ చోరీతోనే గెలిచారని ఆరోపించారు. 

రాష్ట్రంలో వచ్చే రెండేండ్లలో ఎన్నికలు లేనందున ‘సర్’ ప్రక్రియను ఆదరాబాదరగా ముగించకుండా కనీసం ఏడాది పాటు కొనసాగించాలని సీఈవోకు చెప్పామన్నారు. పేదవాళ్ల ఓట్లను తొలగిస్తే వారు తమ ఓట్లను  కాపాడుకునేందుకు సరైన ఆధారాలు ఇవ్వలేరని.. ఆధారాలు సమర్పించేందుకు 3 నెలల సమయం ఇవ్వాలన్నారు. 

బూత్ స్థాయి అధికారులు ఒక్కో ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓట్ల పరిశీలన చేయాలని కోరారు. బయట దేశస్తులు ఉన్నారనే నెపంతో, బీజేపీ వ్యతిరేకులనే ఉద్దేశంతో ఉన్న ఓట్లను తొలగించకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలయ్యేలా చూడాలన్నారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి మహేశ్ గౌడ్ శనివారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 5 రోజులపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటలో ఉండనని ఆయన పేర్కొన్నారు.  

నోటీసుపై స్పందనకు నెల గడువియ్యాలి.. 

‘సర్’ ప్రక్రియ కింద ఎవరికైనా నోటీసు ఇచ్చినా, వారు ఆ నోటీసుకు స్పందించేందుకు వీలుగా ఒక నెల రోజుల వ్యవధి ఇవ్వాలని పీసీసీ చీఫ్ సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 2022, 2025 ఓటర్ల జాబితాను అందించాలని, ఎవరి ఓటైనా తొలగించే ముందు విధిగా వారికి నోటీసు ఇవ్వాలని, స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వేరే చోట హాస్టల్ లో ఉండే విద్యార్థులు తమ ఓట్లు నమోదు చేసుకోకుండా చూడాలని కోరారు. 

2002 తర్వాత తెలంగాణకు వచ్చిన వారు, కనీసం రెండు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే అలాంటి వారి ఓట్లను తొలగించకుండా చూడాలన్నారు. ఓటు హక్కు కోసం పౌరసత్వానికి సంబంధించిన ఆధారాల కోసం డిమాండ్ చేయరాదని పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. సీఈవోను కలిసిన వారిలో పీసీసీ చీఫ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్,  ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, శ్రీ గణేశ్, పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు ఉన్నారు.