కేటీఆర్ కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు: మహేశ్ కుమార్ గౌడ్

కేటీఆర్ కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు: మహేశ్ కుమార్ గౌడ్
  •     మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తం: మహేశ్​ కుమార్ ​గౌడ్
  •     దేవుళ్ల పేరిట రాజకీయాలు దేశానికి మంచిది కాదు
  •     కామారెడ్డిలో ఇందిరా గాంధీ విగ్రహం ఆవిష్కరించిన పీసీసీ చీఫ్

కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ నేత కేటీఆర్​కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ అన్నారు. టెలిగ్రాఫిక్ యాక్ట్ చదివితే కేసు తీవ్రత ఏమిటో ఆయనకు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తప్పు చేశారు కాబట్టే లొట్టపీసు కేసు అంటున్నారని మండిపడ్డారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి మహేశ్​గౌడ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్​ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అలాగే పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్​గౌడ్ మాట్లాడుతూ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పలువరు రాజకీయ నాయకులు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూశారన్నారు. హరీశ్​రావును విచారణకు పిలవడం రాజకీయ వేధింపు కాదని, వేధింపులకు పాల్పడే వాళ్లమయితే రెండేండ్ల వరకు ఎందుకు వేచి చూస్తామన్నారు. అప్పుడే జైలుకు పంపేవాళ్లమని చెప్పారు.

అర్వింద్ జై శ్రీరాం అనకుండా ఓట్లు అడగాలి

దేవుళ్ల పేరిట రాజకీయాలు దేశానికి మంచిది కాదని, కులం, మతం అనేవి మన పిల్లలకు భవిష్యత్తును తీసుకురావని మహేశ్ గౌడ్ అన్నారు. రాముడు, అంజనేయుడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జై శ్రీరాం అని అనకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. ఆయన రాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేస్తామన్నారు. దేవుళ్లతో రాజకీయాలను ముడి పెట్టవద్దని అన్నారు. 

ఉపాధిహామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న సర్పంచ్​లు గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావట్లేదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం స్టేట్​లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు.