- ఎమ్మెల్సీ అభ్యర్థులపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత
- కేబినెట్లో అందరి శాఖలను మార్చాలని సీఎంను కోరా
- తాతా మధు వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ఎప్పటికైనా బీసీ వ్యక్తే సీఎం అవుతాడని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. తానే సీఎం అవుతానని.. చెప్పడం లేదని, కాంగ్రెస్‌లో ఏ బీసీ నేత అయినా కావచ్చని తెలిపారు. మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వడపోత కార్యక్రమం కొనసాగుతోందని, రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని చెప్పారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ నియోజకవర్గానికి నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఈ ప్రక్రియను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలిస్తున్నారని వివరించారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కూడా నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, దీనిని మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
దళితులంటే బీఆర్ఎస్కు చులకన.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దళితుడు కావడంతో ఆయనను ‘అధ్యక్షా’ అని పిలవాల్సి వస్తుందనే కారణంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మహేశ్‌గౌడ్ ఆరోపించారు. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంలో భాగమేనని, అందుకే ఈ వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించడం లేదన్నారు.
బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ కొనుగోలు చేసి, ఆయనకు ప్రతిపక్ష పదవి లేకుండా చేసిందని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను అర్ధరాత్రి బర్తరఫ్ చేశారని, పదేండ్ల పాలనలో కేసీఆర్ సీఎం హోదాలో ఏనాడూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదన్నారు. ఎందరో దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్నందున మంత్రివర్గంలో అందరి శాఖలను మార్చాలని పార్టీపరంగా సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు ఆయన తెలిపారు.
