టీఆర్ఎస్ యాడ్స్ పై ఎంక్వైరీ చేయాలె

టీఆర్ఎస్ యాడ్స్ పై ఎంక్వైరీ చేయాలె

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు పంచుతోంది

    చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు కాంగ్రెస్ కంప్లైంట్


హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇస్తున్న వందల కోట్ల యాడ్స్ పై ఐటీ ఎంక్వైరీ జరపాలని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వీటికి ఎవరు డబ్బులు ఇస్తున్నరో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల రూల్స్ ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, నిరంజన్.. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతోందన్నారు. 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ కావాలని ఉద్యోగుల కోరుతుంటే..  మీడియా లో 29 శాతం అంటూ లీక్ ఇచ్చారని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ ను ఓడిస్తేనే ఉద్యోగులకు మంచి ఫిట్ మెంట్ వస్తుందన్నారు. ఓట్ల కొనుగోలుకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని, కోట్ల రూపాయలు పంచుతున్నారని, ఓటర్లను తరలించడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులను ఉపయోగిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. డిగ్రీ లేనివారిని ఓటింగ్ కు అనుమతి ఇవ్వవద్దని కోరారు. టీఆర్ఎస్ దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీనిని అడ్డుకోవాలని సీఈవోను కోరినట్టు తెలిపారు. పోస్టల్ ఓట్లను పోలీసులు సేకరించి టీఆర్ఎస్ కు వేసేలా పని చేస్తున్నారని, వాళ్లను అడ్డుకోవాలని కోరారు. పీవీ నర్సింహారావు బతికున్నప్పుడు కేసీఆర్ బూతు మాటలు మాట్లాడారని, ఇప్పుడు ఆయన బొమ్మను వాడుకుంటున్నారని విమర్శించారు. తమ నాయకుడి ఫొటో వాడుకోవడం పట్ల సీఈవోకు అభ్యంతరం తెలిపినట్టు ఉత్తమ్ చెప్పారు