డీజీపీని తొలగించాలి..రేవంత్ డిమాండ్

డీజీపీని  తొలగించాలి..రేవంత్ డిమాండ్
  • అధికారులు అధికారుల్లా వ్యవహరించండి.. బీఆర్ఎస్ కార్యకర్తల్లా కాదు
  • డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం.. తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు పదవులు సోనియా భిక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీని వెంటనే తొలగించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు.. కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఉన్న వారిపై, పార్టీ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌కు సాయం చేసే వారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్‌‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేశారట. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌‌కు ఇచ్చారు. కొంత మందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట. బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో.. నీ అధికారం 45 రోజులే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం. అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ వంటి వాళ్లు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి. బీఆర్​ఎస్ కార్యకర్తల్లా కాదు” అంటూ మండిపడ్డారు. గురువారం పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కొడుకు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి.. రేవంత్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియస్ ఐతు.. గాంధీభవన్‌‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. తాండూరు, మానకొండూరు, ఎల్బీ నగర్​ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలూ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ తాగుబోతుల అడ్డాగా మార్చారని ఫైర్ అయ్యారు. ‘‘అక్బరుద్దీన్ ఒవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌‌లా మాట్లాడుతున్నారు. నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మరి వాళ్లు వచ్చేందుకు సిద్ధమా?” అని అక్బరుద్దీన్‌‌కు సవాల్ విసిరారు. 

అధికారుల సంగతిని తేలుస్తం

రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలపైనే తొలి సంతకం పెడతామని చెప్పారు. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసినట్టే సోనియా గాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలైన మంత్రులు కేటీఆర్, హరీశ్ మొరుగుతున్నారని ఫైరయ్యారు. ‘‘కేసీఆర్ సీఎం అయినా, కేటీఆర్, హరీశ్ మంత్రులు అయినా అది సోనియా గాంధీ భిక్షే. ఆ పదవులన్నీ కాంగ్రెస్ దయే. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, అందుకే సెప్టెంబర్ 17న ఆరు గ్యారంటీలను సోనియా ప్రకటించారని చెప్పారు. ‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదు. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీశ్‌‌రావు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలపై ఇన్నాళ్లు కేసులు పెట్టారు.. ఇంకో 45 రోజుల్లో మా కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయి. అందరు అధికారుల సంగతిని తేలుస్తాం’’ అని హెచ్చరించారు.