అభివృద్ధి అంటే అద్దాల మేడలేనా: రేవంత్

అభివృద్ధి అంటే అద్దాల మేడలేనా: రేవంత్
  • కేసీఆర్ కు వచ్చేది 12 సీట్లో, 35 సీట్లో
  • అధికారంలోకి వస్తే గిరిజన వర్సిటీ,
  • ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు

జయశంకర్​ భూపాలపల్లి/ములుగు, వెలుగు: పేదల కు అనుమతి లేని ప్రగతి భవన్ ఎందుకని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో గడీలను పేల్చిన నక్సలైట్లు.. ప్రగతి భవన్ ను పేల్చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. అద్దాల మేడలు, రంగు రంగుల గోడలతో అభివృద్ధి జరిగినట్లు కాదని కామెంట్ చేశారు. హాత్​సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం ములుగు జిల్లా పాలంపేట నుంచి ములుగు దాకా 14 కి.మీ రేవంత్ నడిచారు. తర్వాత ములుగులో కార్నర్ ​మీటింగ్​లో మాట్లాడారు. కేసీఆర్​ సీఎం అయ్యాక ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోలేదని మండిపడ్డారు. కనీసం వాళ్లను పిలిచి ప్రగతి భవన్​లో బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. 2001లో రబ్బర్ చెప్పులతో తిరిగిన కేసీఆర్..​ 9 ఏండ్ల పాలనలో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్​కు నష్టం జరుగుతుందని తెలిసినా, సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలి. మేం అధికారంలోకి వస్తే ములుగు గిరిజన యూనివర్సిటీని ప్రారంభిస్తాం. మల్లంపల్లిని మండలం చేస్తాం. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెడ్తాం” అని హామీ ఇచ్చారు. 

పనిచేసేటోళ్లకే టికెట్.. 

‘‘ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ నుంచి 23 మందిని చేర్చుకుంటే, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్​నుంచి 12 మందిని, వివిధ పార్టీల నుంచి 35 మందిని చేర్చుకున్నారు. ఆయనకు కూడా 12 సీట్లో, లేకపోతే 35 సీట్లో వస్తాయి కావచ్చు” అని రేవంత్ అన్నారు. తన యాత్రకు జనాన్ని తరలించడం లేదని చెప్పారు. ‘‘పాదయాత్రలో ప్రతి పది, 15 రోజులకు ఆయా రంగాలకు సంబంధించి మేనిఫెస్టో డిక్లేర్ చేస్తాం. ఆ టైమ్ లో పార్టీ మఖ్య నేతలు వస్తారు. అప్పుడు జన సమీకరణ చేస్తాం” అని తెలిపారు. కాంగ్రెస్ లో పని చేసేటోళ్లకే ప్రాధాన్యం ఉంటుందని, గతంలో లాగా ఎవరికి పడితే వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పనిచేసే వాళ్లకు, ప్రజల్లో గుర్తింపు ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలకు ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఇన్ చార్జులుగా ఉన్నారని, మూడు రిపోర్టులలో కామన్ గా వచ్చిన నాయకుడే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని వెల్లడించారు. ‘‘ఇది లీడర్ల పనితీరుపై అవగాహన కోసం చేస్తున్న యాత్ర. ఇది ఫెయిల్ అనుకున్నా, పాస్ అనుకున్నా అభ్యంతరం లేదు. ప్రజల వద్దకు లీడర్లను పంపించడమే మా ప్రోగ్రాం లక్ష్యం” అని చెప్పారు. కాంగ్రెస్ లో కొట్లాటలు మాములేనని, కాళ్లల్లో కట్టెలు పెట్టడం మాములేనని కామెంట్ చేశారు. 

ఎంఐఎం ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు

ఎంఐఎం ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని రేవంత్ అన్నారు. ‘‘ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ పార్టీలు బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్నాయి. దీనివల్ల ఆ పార్టీలు  నష్టపోవడం ఖాయం” అని అన్నారు. కాగా, కార్నర్ మీటింగ్ అనంతరం రేవంత్ వెహికల్ లో మహబూబాబాద్​కు వెళ్లిపోయారు. మధ్యలో ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో యాత్ర చేయకుండా మహబూబాబాద్ వెళ్లడం గమనార్హం.