కేసీఆర్ మనీ, మందునే నమ్ముకున్నడు: రేవంత్రెడ్డి

కేసీఆర్ మనీ, మందునే నమ్ముకున్నడు: రేవంత్రెడ్డి
  • కేసీఆర్.. వాటితోనే గెలవాలని చూస్తున్నడు: రేవంత్
  • హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో వేల కోట్లు పంచారని ఆరోపణ 
  • గన్ పార్క్ వద్ద ప్రమాణానికి వెళ్లిన రేవంత్
  • అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు  

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిచేందుకు మనీ, మందునే కేసీఆర్ నమ్ముకున్నారని పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి అన్నారు. మనీ, మందు లేకుండా కేవలం మేనిఫెస్టోను చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామని, గన్​పార్క్​అమరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామంటూ రెండ్రోజుల కింద కేసీఆర్ కు సవాల్ చేసిన రేవంత్.. మంగళవారం ప్రమాణం చేసేందుకు గన్​పార్క్ కు చేరుకున్నారు.

 అయితే ఎన్నికల్ కోడ్​అమల్లో ఉందంటూ రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. అమరుల స్థూపం వద్దకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్​శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా రేవంత్​ను కారులో ఎక్కించి అరెస్టు చేశారు. అనంతరం గాంధీభవన్​కు తరలించారు. అక్కడ రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎక్కడ డబ్బు దొరికినా కాంగ్రెస్​వేనంటూ కేటీఆర్, హరీశ్​రావు ఆరోపణలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి డబ్బులొస్తున్నాయంటూ మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. 

అందుకే ప్రమాణానికి రమ్మన్నా.. 

హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడి డబ్బులు పంచాయని, మందు పోశాయని రేవంత్​ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రూ.వేల కోట్లు ఖర్చు చేశాయన్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రొటెక్షన్​మనీని బీజేపీ ఉపయోగించుకుందని ఆరోపించారు. తమకు డబ్బులు రాలేదంటూ జనాలు రోడ్డెక్కిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. ‘‘ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చారు. ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో మొత్తంగా రూ.10 వేల కోట్ల దాకా ఖర్చు చేశాయి. 

మునుగోడు నియోజకవర్గంలో మామూలుగా ఒక నెలలో రూ.60 కోట్ల వరకే మద్యం అమ్మకాలు ఉంటాయి. కానీ బైపోల్స్ టైమ్ లో కేవలం 20 రోజుల్లోనే రూ.300 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన ఆ రెండు పార్టీలు ఎంతలా మద్యాన్ని ఓటర్లకు పంచాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజూరాబాద్​బైపోల్స్​అని ఆ టైమ్ లో విశ్లేషకులు అన్నారు. కానీ దానికి మించి మునుగోడులో ఖర్చు చేశారు” అని ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చేందుకే మందు, 

మనీ పంపకాల్లేకుండా ఎన్నికలకు వెళ్లేలా ప్రమాణం చేద్దామంటూ కేసీఆర్​ను అమరుల స్థూపం వద్దకు రమ్మన్నాను. కానీ, కేసీఆర్​నా సవాలును స్వీకరించలేదు. గన్​పార్క్​వద్దకు రాలేదు. పైగా అక్కడికి వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేవలం సిద్ధాంతాలను ప్రచారం చేసే ఓట్లు అడుగుతామన్నారు. గన్ పార్క్ వద్ద కేవలం కాంగ్రెస్ కే నిబంధనలు అడ్డొచ్చాయా?, బీఆర్ఎస్ వాళ్లు ధర్నా చేస్తే మాత్రం అనుమతి అవసరం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ టాస్క్​ఫోర్స్​లో రిటైర్ అయిన అధికారులను కొనసాగిస్తూ, వారితో తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ అధికారులంతా కేసీఆర్ బంధువులేనని చెప్పారు. 

ప్రభుత్వం ప్రవళిక కుటుంబం పరువు తీసింది.. 

ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఆమె కుటుంబం పరువు మంటగలిసేలా ప్రభుత్వం వ్యవహరించిందని రేవంత్ మండిపడ్డారు. ‘‘ప్రేమ విఫలమై చనిపోయిందంటూ ఓ పోలీసు అధికారి ఎలా చెబుతారు. అమ్మాయి ఫోన్​సీజ్​చేస్తే, సమాచారం ఎలా బయటకు వచ్చింది. ప్రెస్​మీట్​లో డీసీపీ చెప్పినవన్నీ అబద్ధాలే. ఏదైనా ఎవిడెన్స్​దొరికితే, దాన్ని ఓపెన్​ చేయకుండా కోర్టుకు పంపించాలి. ఆ తర్వాత దాన్ని ఫోరెన్సిక్ అనాలిసిస్​కు పంపించాల్సి ఉంటుంది. ప్రవళిక కేసులో ఇవేవీ జరగలేదు. 

ఫోరెన్సిక్​నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్​మీట్​ఎలా పెడతారు” అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టాస్క్​ఫోర్స్​లో పని చేస్తున్న రిటైర్డ్​అధికారులపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై నిరుద్యోగులంతా పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రవళిక కుటుంబ సభ్యులను రాహుల్​గాంధీ వద్దకు తీసుకెళ్దామనుకుంటే.. బీఆర్ఎస్​నేతలు వారిని ప్రగతిభవన్​లో బంధించేందుకు తీసుకెళ్తున్నారని తెలిసిందన్నారు. 

దివ్యాంగురాలికి ఉద్యోగ హామీ..

హైదరాబాద్ లోని నాంపల్లికి చెందిన రజనీ అనే దివ్యాంగురాలు రేవంత్​ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తాను ఎంకామ్​ పూర్తి చేశానని, పదేండ్లయితున్నా ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేట్​ఉద్యోగమూ దొరకట్లేదని వాపోయింది. స్పందించిన రేవంత్.. తాము అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం రజనీకే ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్​ప్రభుత్వం వస్తుందని, ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు వస్తే.. ఏదో ఒక డిపార్ట్​మెంట్​లో అర్హత ఉన్న జాబ్​ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్​ గ్యారంటీ కార్డుపై ఆమె వివరాలు రాసుకున్నారు.