జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాస్తాం

జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాస్తాం

హైదరాబాద్ లో వరదలు, ప‌లు జిల్లాల్లో పంట నష్టం పైన ప్రధాని మోడీకి లేఖ రాయనున్న‌ట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు కాంగ్రెస్ కోర్ కమిటీలో ప‌లు నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్ల‌డించారు. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టం జరిగింద‌ని, ఈ విపత్తును జాతీయ విపత్తు గా ప్రకటించాలని ప్రధానమంత్రిని కోరాలని నిర్ణయించామ‌న్నారు.

సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నారని, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేసీఆర్ ప్రగతిభవన్ దాటి ఎక్కడికి వెళ్లడం లేదని, ఎవరిని పరామర్శించడం లేదని విమ‌ర్శించారు.

హైదరాబాద్ లో వరదల వల్ల మునిగిన ఇండ్ల కు రూ.10 వేలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను అవమానిస్తుందని అన్నారు ఉత్త‌మ్. వరదలు, వర్షాల వల్ల చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఇండ్లు కూలిపోతే 5 లక్షలు,పాక్షికంగా దెబ్బతింటే 2 లక్షలు,ఇండ్లలోకి నీళ్లు చేరితే 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరా పంట నష్టానికి రూ.20 వేల ను రైతుకు చెల్లించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తేమ,రంగు అని చూడకుండా రైతుల దగ్గర పంట ను కొనుగోలు చేయాలని ఉత్త‌మ్ అన్నారు.