
రాష్ట్రంలో పీసీసీ కమిటీ, సమన్వయ కమిటీ, వర్కింగ్ కమిటీలు కీలకంగా పనిచేయాల్నారు.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా. ప్రతినెలా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండలస్థాయి సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. రాష్ట్రస్థాయి నేతలకు ఒక్కో నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలన్నారు కుంతియా.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై త్వరలోనే నిపుణులతో కమిటీ వేస్తామన్నారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు ఉత్తమ్. కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటాలు చేస్తామన్నారు. సోమవారం జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు సెక్రటేరియట్ పరిశీలిస్తారని చెప్పారు. కొత్త అసెంబ్లీ అవసరం లేదు.. పాత సెక్రటేరియట్ కూల్చివేయొద్దన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు ఉత్తమ్.
కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ అనుసరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు. కాంగ్రెస్ కు పూర్వవైభవం కోసం నేతలంతా ఐక్యంగా పనిచేయాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయించారు నేతలు. హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించిన నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడయ్యారు.