- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ ఈ మధ్య బయటకు వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కు కూతురు స్ట్రోక్ తగిలిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాటాల పంపకాల నుంచే కవిత పార్టీ పుట్టిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉనికిని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు.
రెండున్నరేండ్లలో తాము నాలుగున్నర లక్షల ఇండ్లు ఇచ్చామని, పదేండ్లలో బీఆర్ఎస్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్ కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్తో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించడం లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో హరీశ్‌రావు పాత్ర ఉందన్నారు.
హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆరోపించారు. మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ నెలలోనే కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ‘సర్’పై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓటును సర్ పేరుతో తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోదీ, కేసీఆర్ సభలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు.
