ఇందిరాగాంధీ విగ్రహానికి  టీఆర్​ఎస్​ ఫ్లెక్సీలేంది?

ఇందిరాగాంధీ విగ్రహానికి  టీఆర్​ఎస్​ ఫ్లెక్సీలేంది?
  • విభజన హామీలపై ఇన్నాళ్లూ ఎందుకు మాట్లాడలే
  • కేసీఆర్​పై పీసీసీ చీఫ్  రేవంత్​ రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: విభజన హామీలపై ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే.. 16 నెలలు అటువైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదని, జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై ప్రశ్నించలేదని ఆయన అన్నారు. విభజన చట్టంపై, మోడీ ఇచ్చిన హామీలపై ప్రశ్నించేందుకు కేసీఆర్ కు అవకాశం ఉన్నా వదిలేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ విగ్రహాలకు టీఆర్ ఎస్ జెండాలు కట్టడంపై ఆందోళన చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , యూత్ కాంగ్రెస్ నేత అనీల్ కుమార్ యాదవ్​ను పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లి పీఎస్ కు తరలించారు. వారిని శనివారం రేవంత్​రెడ్డి పరామర్శించారు. అనంతరం షబ్బీర్ ఆలీ, అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పును తప్పు అని ప్రశ్నించిన మా నేతలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి టీఆర్ఎస్, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు తెరలేపారు. కల్లు కంపౌండ్ లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారు” అని దుయ్యబట్టారు. సమస్యలపై చర్చ జరగకుండా ఫ్లెక్సీ లతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తి ని భూప్రపంచంలో చూడలేదని ఆయన విమర్శించారు. ‘‘ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్ఎస్ జెండా లు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారు? శుక్రవారం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన వాటిని తొలగిస్తే.. శనివారం  మళ్లీ కట్టారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతం? ఇవి మానుకోకపోతే.. కేసీఆర్, కేటీఆర్ వీపులకు కాంగ్రెస్ జెండాలు కడుతాం” అని హెచ్చరించారు.  

కార్పొరేట్​ కంపెనీల పైసలతో సమావేశాలు

కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్నదని రేవంత్​ ఆరోపించారు.  జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్నాయని, హైదరాబాద్ నుంచి జాతీయస్థాయి వరకు ఎదిగిన కార్పొరేట్ సంస్థల కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు అన్యాయం చేయడానికి బీజేపీ నేతలు వచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలు మోడీని ప్రధానిగా అంగీకరించరని అన్నారు. తెలంగాణ ఏర్పాటును శంకించిన మోడీకి.. ఈ గడ్డపై అడుగుపెట్టే అర్హతలేదని రేవంత్​ పేర్కొన్నారు.