కొండా సురేఖ బాటలో.. బెల్లయ్యనాయక్ రాజీనామా

కొండా సురేఖ బాటలో.. బెల్లయ్యనాయక్ రాజీనామా
  • పీసీసీ కొత్త కమిటీలపై ముదురుతున్న వివాదాలు
  • నిన్న కొండా సురేఖ.. నేడు బెల్లయ్య నాయక్.. మరి రేపు..?

హైదరాబాద్ : పీసీసీ కొత్త కమిటీలపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. కొత్త టీమ్ లో పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ తన పదవి రాజీనామా చేయగా.. ఇవాళ బెల్లయ్య నాయక్.. పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ఛైర్మన్ గా ఉన్న తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఎందుకు స్థానం ఇవ్వరని బెల్లయ్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ సెక్రెటరీ స్థాయి పోస్ట్ లో ఉన్న తనకు పీసీసీ కమిటీలో లేదంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు ఎందుకు ఇవ్వరని బెల్లయ్య నాయక్ ప్రశ్నిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నేతలపై కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు ఉందని ఆరోపించారు. 

గతంలోనూ పీఏసీలో కోదండరెడ్డికి, తనకు అవకాశం ఇస్తామని చెప్పి కేవలం ఆయనకే ఆహ్వానం పంపేవారని బెల్లయ్య నాయక్ అన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన బెల్లయ్య నాయక్.. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పంపారు.

మంత్రి పదవినే వదిలేశానన్న వెంకట్ రెడ్డి

పీసీసీ కమిటీల్లో తనకు స్థానం కల్పించకపోవడంపై తొలుత  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించి మంత్రి పదవినే వదిలేసిన తనకు పార్టీ పదవులు ఒక లెక్క కాదని చెప్పిన విషయం తెలిసిందే. పార్టీలోనే ఉంటానని.. నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. వచ్చే జనవరి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించడం నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టించింది. 

అసంతృప్తితో ఎర్రబెల్లి స్వర్ణ.. మరికొందరు 

పీసీసీ కమిటీలో చోటు కోసం ఎదురు చూసిన ఆశావహులు చోటు దక్కకపోవడంతో నిరాశకు లోనయ్యారు. కష్ట కాలంలో పార్టీని అంటిపెట్టుకుని బోలపేతం చేసేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్న వారికి ఎలాంటి ప్రాధాన్యత, గుర్తింపు కల్పించడం లేదని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సేవలు అందించే వారికి తప్పక గుర్తింపు కల్పించే ప్రయత్నం చేస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుజ్జగించినట్లు సమాచారం. 

టీపీసీసీలో కమిటీల చిచ్చు చల్లారేదెలా..?

కాంగ్రెస్ హైకమాండ్ శనివారం ప్రకటించిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలు తెలంగాణ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. నిన్న కొండా సురేఖ.. ఇవాళ బెల్లయ్య నాయక్.. మరి రేపు.. ఎవరన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి. తాజా కమిటీలతో ఏర్పడిన చిచ్చును చల్లార్చేందుకు హైకమాండ్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది..? హైకమాండ్ విధేయులు, సీనియర్ల బుజ్జగింపులు ఫలిస్తాయా.. ? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.