ఆ 10 నియోజకవర్గాల కోసం పీసీసీ కమిటీ : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌

ఆ 10 నియోజకవర్గాల కోసం పీసీసీ కమిటీ : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌
  • కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కోసం వేస్తున్నం: పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌
  •     మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తులపై పీఏసీలో చర్చించి నిర్ణయం
  •     కవిత కాంగ్రెస్‌‌లో చేరనున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు
  •     కవిత ఆరోపణలను జనం నమ్ముతున్నారు.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ జవాబు చెప్పాలి
  •     మరో 3 నెలల తర్వాతనే కార్పొరేషన్ పదవుల భర్తీ  
  •     ఈ నెల 16 న నిర్మల్‌‌లో సీఎం సభ
  •     ఫిబ్రవరి మూడో వారం నుంచి రేవంత్ జిల్లాల పర్యటన ఉంటుందని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం  త్వరలోనే కమిటీ వేయనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. 10  ఉమ్మడి జిల్లాలకు..జిల్లాకో కమిటీ చొప్పున నియమిస్తామని, ఈ కమిటీలో ఇన్‌‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌‌చార్జీలు, ఇతర సీనియర్ నేతలు ఉంటారని వివరించారు. ఏ నియోజకవర్గంలో పార్టీలో సమస్య ఉందో,  ఆ నియోజకవర్గానికి కమిటీ వెళ్లి సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. 

మున్సిపల్ ఎన్నికల్లో  పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కోసమే ఈ కమిటీలను వేస్తున్నామని వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్ లో మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్​ మీడియాతో చిట్ చాట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్‌‌తో పలు గ్రామాలను కాంగ్రెస్ మద్దతు దారులు చేజార్చుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ కమిటీలను వేస్తున్నామని వివరించారు. పార్టీలోని పాత నేతలను వదులుకోబోమని, కొత్త వారిని కలుపుకొని ముందుకు పోతామన్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తుపై పీఏసీ ( పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ) సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక పాదర్శకంగానే ఉంటుందని చెప్పారు. డీసీసీలు తీసుకునే నిర్ణయంపైనే  కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. కాంగ్రెస్‌‌లో ఏదైనా సమిష్టి నిర్ణయంతోనే జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్‌‌ ఇక గతమే..

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక గతమేనని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని మహేశ్‌‌గౌడ్​ అన్నారు.  బీజేపీని ఆదరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ లో 90 శాతం మంది హిందువులేనని అన్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని, హిందువుల పేర్ల మీద ఓట్లు అడిగే సంస్కృతి ఆ పార్టీదేనని విమర్శించారు. 

ఈ నెల 16 న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ వెళ్తున్నారని, అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతారని చెప్పారు. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సీఎం రేవంత్ ఉమ్మడి జిల్లాల టూర్ ఉంటుందన్నారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటివరకు పార్టీపరంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? తమ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అనే దానిపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని మహేశ్‌‌గౌడ్​ తెలిపారు. మాజీ సీఎం కూతురుగా ఆమె బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న పలు అవినీతీ ఆరోపణలను జనం నమ్ముతున్నారని చెప్పారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్‌‌పై ఉందన్నారు. సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. 

మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కేసీఆర్ కొడుక్కో జిల్లా, బిడ్డకు ఓ జిల్లా, అల్లుడికి ఓ జిల్లా అన్నట్లుగా ఇష్టారీతిన విభజించారని ఆరోపించారు. 

తమ ప్రభుత్వం జిల్లాల పరిధిని పెంచడంపై దృష్టి పెట్టిందని చెప్పారు. జిల్లాలను తీసేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.  పలు నామినేటెడ్ పదవులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ మరో మూడు నెలల తర్వాతనే ఉంటుందని తెలిపారు. పదవులు తక్కువగా ఉండడం, ఆశించే వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో  భర్తీ  ఆలస్యమవుతున్నదని అన్నారు.