సోనియా, ప్రియాంక తెలంగాణకు వస్తరు.. ఎవరు అడ్డుకుంటరో చూస్తం: మహేశ్ కుమార్ గౌడ్

సోనియా, ప్రియాంక తెలంగాణకు వస్తరు..  ఎవరు అడ్డుకుంటరో చూస్తం: మహేశ్ కుమార్ గౌడ్
  • సోనియా, ప్రియాంక తెలంగాణ వస్తరు..  ఎవరు అడ్డుకుంటరో చూస్తం
  • ఎమ్మెల్సీ కవితపై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్​
  • ప్రియాంక గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదు
  • సీఎం హోదాలో రేవంత్ హెలికాప్టర్​లో ఇంద్రవెల్లికి వెళ్లారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదని, రాహుల్​ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలను చేస్తేనే దేశం నిలబడిందని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేశారు. సోనియా, ప్రియాంక తెలంగాణకు కచ్చితంగా వస్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కామెంట్లు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో సీఎం హోదాలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు.

సీఎంగా ఎవరున్నా భద్రత దృష్ట్యా హెలికాప్టర్ వాడుతారన్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకూ కేసీఆర్ చాపర్లు, హెలికాప్టర్లు వాడలేదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్​గా ఎన్నికైన తర్వాత తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ సీఎం అయ్యాక తొలి సభనూ అక్కడే నిర్వహించారని చెప్పారు. ‘‘తొమ్మిదిన్నరేండ్లలో మీరు దోచుకున్నదెంతో లెక్కలు చెప్పాలె? కాళేశ్వరం ప్రాజెక్టులో నొక్కిన డబ్బు ఎంత? మేడిగడ్డ ప్రాజెక్టులో తీసుకున్న కమీషన్ ఎంత? మీ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తాం.

మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి నిజామాబాద్ పరువు తీశారు’’ అని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. 17కు 17 స్థానాల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 45 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.