- చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా బల్దియా ఎన్నికలు
- ఓట్ల పండుగలో జోరుగానోట్లు, మద్యం వరద
- అత్యధికంగా హుజూరాబాద్‌లో 81.47శాతం, అత్యల్పంగా కరీంనగర్‌లో 62.98 శాతం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 81.52 శాతం, హుజూరాబాద్ లో 81.47 శాతం పోలింగ్ నమోదు కాగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అతితక్కువగా 62.98 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
కాగా 2020 ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్‌లో ఒక శాతం ఎక్కువగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. పోలింగ్ బూత్‌ల సమీపంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో గుమికూడడంతో పలుచోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
కరీంనగర్ జడ్పీలో 58వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇతర ప్రాంతాలవారితో దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. కరీంనగర్ కిసాన్ నగర్ లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, మరో కార్యకర్త వద్ద నగదు లభ్యమైంది.
కరీంనగర్ 49 డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్ గుంజుకుని పగులగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని బీజేపీ నాయకులను నిలదీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 2,54,639 ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 11 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కలిపి మొత్తం 70.13 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ధర్మపురి మున్సిపాలిటీలో 75.16 శాతం పోలింగ్ నమోదవగా, రాయికల్ మున్సిపాలిటీలో 74.96 శాతం పోలింగ్ నమోదైంది. జగిత్యాల పట్టణంలోని 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మరో ఘటనలో బీజేపీ రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్ పోలింగ్ కేంద్రం వద్ద కంటతడి పెట్టాడు. స్వతంత్ర అభ్యర్థి వీర బత్తిని పద్మజ బంధువు ఆయన చేతిలోని ఫోన్‌ను ‘దొంగ ఓటర్లకు ఫోన్ చేస్తున్నాడు’ అంటూ స్వాధీనం చేసుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. 7వ వార్డు బూత్ నెం.22 లో ఓటు హక్కు లేని వ్యక్తి బూత్‌లోకి రావడంతో ప్రతిపక్ష అభ్యర్థులు నిలదీశారు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదే సమయంలో 4వ వార్డులో ఐదు నిమిషాల ఆలస్యంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ షేక్ అమీర్‌ను అధికారులు వెనక్కు పంపించారు. కోరుట్లలో దుబాయ్‌లో ఉన్న ఓటర్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి దొంగ ఓటు వేయడంతో అక్కడ కూడా ఉద్రిక్తత చెలరేగింది.
పోలింగ్ ప్రశాంతం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభంమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పెరిగింది. రెండు మున్సిపాలిటీల్లో 77.70శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
