బీజేపీకి సెలెక్టివ్ అమ్నీషియా: ఎంపీ వంశీకృష్ణ

బీజేపీకి సెలెక్టివ్ అమ్నీషియా: ఎంపీ వంశీకృష్ణ
  • ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ సెలెక్టివ్​ఆమ్నీషియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ వంశీకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను తరచూ దేశవిరోధులుగా చిత్రీకరించడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మాజీ ప్రధాని జవహర్​లాల్​నెహ్రూ గతంలో తీసుకున్న నిర్ణయాలను  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. నేటి దేశ పరిస్థితులకు నెహ్రూను  బాధ్యుడిగా చూపించడం అన్యాయమన్నారు.  గతంలో  -భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నిస్తే బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.

సభలో అమిత్ షా, రిజిజు, రాజ్‌నాథ్ సింగ్ లు లేచి రాహుల్ గాంధీ మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానమని వంశీ కృష్ణ వ్యాఖ్యానించారు. నిజాలను ప్రజల ముందుకు రానివ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైందని ప్రకటించినప్పటికీ, ఆ ఆపరేషన్ తర్వాత రెడ్ ఫోర్ట్‌పై జరిగిన దాడి విషయంలో ఎందుకు చర్చ జరగలేదని ప్రశ్నించారు.బీజేపీ నేతలు తమకు అనుకూలమైన విషయాలనే గుర్తుంచుకుని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గడ్డం వంశీ కృష్ణ ఆరోపించారు. రాహుల్ గాంధీ సత్యం కోసం, దేశం కోసం నిలబడుతున్నారని, ఆ నిజాన్ని ఎదుర్కోలేక బీజేపీ భయపడుతోందని ఆయన  స్పష్టం చేశారు.