యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్: ఎంపీ వంశీకృష్ణ

యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్: ఎంపీ వంశీకృష్ణ

 

  • దీంతో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతున్నది: ఎంపీ వంశీకృష్ణ 
  • మేనేజ్‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంతో ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉన్నది
  • 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులే చేస్తున్నరు 
  • పరిస్థితి ఇట్లనే ఉంటే మేనేజ్‌‌‌‌మెంట్ పనితీరుపై 
  • సీబీఐ ఎంక్వైరీ కోరతానని వెల్లడి 

గోదావరిఖని, వెలుగు: విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. అంతర్జాతీయ సంబంధాలు సరిగాలేక ఉక్రెయిన్​ నుంచి 10 లక్షల టన్నులు, చైనా నుంచి 30 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోలేకపోయిందని చెప్పారు. దీంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్)పై ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్​నిర్లక్ష్యం వల్లనే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌లో యూరియా ఉత్పత్తి తక్కువగా ఉంటున్నదని వంశీకృష్ణ చెప్పారు. ‘‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌లో 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశాను. ఆయనను మళ్లీ కలిసి వివరిస్తాను. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ​విధానాలపై సీబీఐ ఎంక్వైరీ కోరతాను” అని వెల్లడించారు. నోయిడాలోని ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్​ సెంట్రల్​ ఆఫీసును రామగుండంకు తరలించాలని డిమాండ్​ చేశారు. 

మనకు ఒక్కటే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టా? 

రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్​ఏర్పాటు విషయంలో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వంశీకృష్ణ మండిపడ్డారు. రూ.150 కోట్లతో టెండర్​ పిలిచినప్పటికీ పనులు జరగడం లేదని, దీనిపై కేంద్రమంత్రి మన్‌సుఖ్​మాండవీయకు లేఖ రాశానని తెలిపారు. ‘‘అంతర్గాంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ఏర్పాటు కోసం సీఎం రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి చేయగా, ఫీజిబులిటీ రిపోర్టు కోసం ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ఇండియాకు రూ.50 లక్షలు కేటాయించారు. త్వరలోనే ఆ రిపోర్టు రానున్నది. ఏపీలో 8 ఎయిర్​పోర్టులు ఉంటే, తెలంగాణలో ఒక్కటే ఉండడమేంటి?” అని ప్రశ్నించారు. ‘‘సింగరేణి రిటైర్డ్ కార్మికులకు చాలామందికి రూ.వెయ్యి లోపే పెన్షన్​ వస్తున్నది. దీన్ని రూ.10 వేలకు పెంచాలని పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించాను. ఈ విషయమై సీఎంపీఎఫ్ ట్రస్ట్​ బోర్డు సెక్రటరీ దేవదత్‌‌‌‌‌‌‌‌ను కలిసి విజ్ఞప్తి చేస్తాను. ప్రతి టన్ను బొగ్గుకు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు రూ.20 చెల్లించేలా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ఒప్పించాను. దీంతో ట్రస్టుకు రూ.150 కోట్లు జమయ్యాయి. అయితే పెన్షన్​ పెంపు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు” అని తెలిపారు. సింగరేణిలో మారుపేర్ల కార్మికులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను బి–-గ్రేడ్‌‌‌‌‌‌‌‌కు​ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. 

పెద్దపల్లి అభివృద్ధే ధ్యేయం.. 

పెద్దపల్లి పార్లమెంట్​నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని వంశీకృష్ణ పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టాను. రామగుండంలో వందేభారత్​రైలుకు హాల్టింగ్ ఏర్పాటు చేయించాను. కుందనపల్లి వద్ద రూ.120 కోట్లతో, కన్నాల వద్ద రూ.80 కోట్లతో రైల్వే ఓవర్​బ్రిడ్జీల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా 800 మెగావాట్ల మూడు యూనిట్లను ప్రారంభించే పనులు ముందుకు సాగుతున్నాయి. అంతర్గాం మండలం లింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెదర్​ పార్క్​ఏర్పాటుతో 500 మందికి ఉపాధి లభిస్తుంది” అని తెలిపారు. ఈ సమావేశంలో లీడర్లు బాబర్​సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, పి.మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు, కామ విజయ్, సజ్జద్, తిప్పారపు మధు, జావెద్, నర్సింగ్​దొర తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు..  

పెద్దపల్లి సెగ్మెంట్​ పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం మంచిర్యాలలోని తన ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘పెద్దపల్లిలో సెమీ కండక్టర్​ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో దాన్ని ఏపీకి కేటాయించారు. దాని స్థానంలో మరో ఇండస్ర్టీ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాను. రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లతో సెమీ కండక్టర్​ యూనిట్​ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాను. మందమర్రిలో లెదర్ పార్క్, జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాను” అని వంశీకృష్ణ తెలిపారు. ‘‘మంచిర్యాల హమాలివాడ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. బెల్లంపల్లి, తాండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో రెండు ఎఫ్‌‌‌‌‌‌‌‌వోబీలు సాంక్షన్ చేయిస్తాను. మంచిర్యాలలో శబరిమల ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్​ హాల్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నాను” అని చెప్పారు. ‘‘చెన్నూరులో ఇసుక అక్రమ రవాణా బంద్ అయింది. అభివృద్ధి కార్యక్రమాలను చూడలేకనే ప్రభుత్వంపై బురద జల్లేందుకు బాల్క సుమన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన హయాంలోనే వేల కోట్లలో శాండ్​ స్కామ్​ జరిగింది” అని మండిపడ్డారు. సమావేశంలో డీసీసీ చైర్మన్​ పిన్నింటి రఘునాథ్​ రెడ్డి పాల్గొన్నారు.