ఎన్టీపీసీ విస్తరణలో  స్థానికులకు ఉద్యోగాలివ్వాలి: ఎంపీ వంశీకృష్ణ

ఎన్టీపీసీ విస్తరణలో  స్థానికులకు ఉద్యోగాలివ్వాలి: ఎంపీ వంశీకృష్ణ
  • సంస్థ సీఎండీ గురుదీప్ సింగ్‌‌‌‌కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వినతి
  • మాతంగి కాలనీ వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో 
  • తగిన న్యాయం చేయాలి    కాంట్రాక్ట్ కార్మికులు, 
  • స్థానిక యువతకు ఉపాధి అంశాలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో పరిధిలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే మాతంగి కాలనీ వాసులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను మరోసారి ఎన్టీపీసీ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఢిల్లీలో ఎన్టీపీసీ, సీఎండీ గురుదీప్ సింగ్‌‌‌‌తో వంశీకృష్ణ ప్రత్యేకగా సమావేశం అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీలో.. ఎన్టీపీసీ విస్తరణలో రామగుండం ప్రజల హక్కులు, స్థానిక యువతకు ఉపాధి, కార్మికుల సంక్షేమం కోసం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రామ గుండంలో భారీ ప్రాజెక్టులు, విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ.. స్థానిక యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ప్రజలు వ్యక్తం చేసిన ప్రధాన డిమాండ్ స్థానికులకే ఉద్యోగ అవకాశాలే అని వివరించారు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా.. అభివృద్ధి ఫలాలు ముందుగా స్థానిక ప్రజలకు అందేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రామగుండంలో చేపడుతోన్న 800×3 మెగావాట్ల ఎన్డీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యతతో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

మాతంగి కాలనీకి న్యాయం చేయండి.. 

ఎన్టీపీసీకి చెందిన పలు ప్రాజెక్టుల విస్తరణతో రామగుండం ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య సమస్యలపై ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల విస్తరణతో ప్రభావితమవుతున్న ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని సీఎండీపి కోరారు. ఇదే సందర్భంలో మాతంగి కాలనీల్లో నివసిస్తున్న బాధిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకే జీలు, తగిన సౌకర్యాలు, న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు కార్మికుల సంక్షేమ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ‘సి’ గ్రేడ్‌‌‌‌లో ఉన్న కార్మికులను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అనుగుణంగా ‘బి’ గ్రేడ్‌‌‌‌కు అప్‌‌‌‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి మూడు నెలలకు నిర్వహిస్తోన్న మెడికల్ ఫిట్‌‌‌‌నెస్ పరీక్షలను  ఏడాదికి ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఈఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఫిట్‌‌‌‌నెస్ సర్టిఫికేట్ తీసుకురావాలని ఒత్తిడి చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానాన్ని పునఃసమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కాగా తమ విజ్ఞప్తులపై ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. ఈ అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా ప్రజల హక్కులు, స్థానిక యువత ఉపాధి, కార్మికుల సంక్షేమం విషయంలో న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.