V6 News

విద్యతోనే దళితుల్లో అభివృద్ధి.. అన్ని రంగాల్లో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

విద్యతోనే దళితుల్లో అభివృద్ధి.. అన్ని రంగాల్లో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు దళితరత్న అవార్డులు ప్రదానం

రవీంద్రభారతి, వెలుగు: దళితులు విద్య ద్వారానే అభివృద్ధి సాధించగలరని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్న రిజ ర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆ రిజర్వేషన్ వల్లే తాను పెద్దపల్లి పార్ల మెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవగలిగానని పేర్కొన్నారు. 

సమాజంలో దళితుల జనాభా గణాంకాల్లో స్పష్టత లేకపోవడం వల్ల వారి అభివృద్ధి దెబ్బతింటోందని, జనాభా ప్రాతిపదికన అభివృద్ధి నిధులు కేటాయించాలని సూచించారు. తన తాత వెంకటస్వామి ఆలోచనతో హైదరాబాద్‌‌‌‌లో అంబేద్కర్ కాలేజీ స్థాపించి, వెనకబడిన వర్గాలకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలు, దళితరత్న అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలకు పాల్పడిందని.. అలాంటి ప్రయత్నాలను పార్లమెంట్‌‌‌‌లో తిప్పికొట్టామని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ దళితరత్న అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్లు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ , బైండ్ల వెంకటేశం, నాయకులు రవి బుగ్గ, మైసన్న భవాని రెడ్డి, ఎలుక పెళ్లి రాజేందర్, తప్పెట్ల ప్రవీణ్, సప్పి పోచన్న, మేరీ మాదిగ బంగారు దుర్గాభవాని, నందిని, రాజలింగం గంగ నరసయ్య, పశుపతి   పాల్గొన్నారు