పెండింగ్​ ఫీజు బకాయిలు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య

పెండింగ్​ ఫీజు బకాయిలు చెల్లించాలి :   ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 20 లక్షల మంది స్టూడెంట్లకు సంబంధించిన రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం సెక్రటేరియట్​లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి స్టూడెంట్ల ఇబ్బందులను వివరించారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా పెండింగ్​పెట్టడంతో కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్లను ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. యాన్యువల్​ఎగ్జామ్స్​టైం కావడంతో, హాల్ టికెట్లు ఇవ్వబోమని చెబుతున్నాయన్నారు. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి, వెంటనే బకాయిలను చెల్లించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య వెంట నీల వెంకటేశ్, అంజి, వివిధ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. 

డీఎస్సీతో పాటు టెట్ ​నోటిఫికేషన్ ​వేయాలి

బషీర్ బాగ్: మెగా డీఎస్సీతోపాటు టెట్​నోటిఫికేషన్​ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం లక్డీకాపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసును తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ముట్టడించింది. జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్​ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఎంపీ ఆర్.కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. డీఎస్సీ కింద 11 వేలు కాదు.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఒకేసారి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు వేసేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలన్నారు. బీఈడీ, డీఈడీ పాసైన వారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. టీచర్ పోస్టుల విషయంలో నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కోరారు. నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్​మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.