
- నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
శంషాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుంటే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రణయ్, శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 5 వేల మంది విద్యార్థులతో భారీ నిరసన చేపట్టారు. శంషాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరేళ్లుగా నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీకాంత్, చరణ్, అరుణ్, వంశీ, తరంగ్ విప్లవ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.