- ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలు రిలీజ్ అయ్యాయి. గతేడాది డిసెంబర్ సహా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన జీతాలను విడుదల చేస్తూ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీచేశారు. దీనికి గానూ రూ.17.56 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఈ వేతనాలను వెంటనే కాలేజీల ప్రిన్సిపల్స్.. గెస్ట్ లెక్చరర్లకు అందించాలని ఆదేశించారు. కాగా, ఈ విద్యాసంవత్సరం పనిచేస్తున్న గెస్టు లెక్చరర్లకు ఇటీవలే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ జీతాలు అందించారు. జూనియర్ లెక్చరర్లకు పెండింగ్ వేతనాలు అందించేందుకు కృషి చేసిన డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
