ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం..పెన్షనర్ల ఆందోళన

ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం..పెన్షనర్ల ఆందోళన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... లక్డికపుల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వ పెన్షన్ దారులు ఆందోళనకు దిగారు. వారం రోజుల్లో తమ సమస్యలపై రాష్ట్ర సర్కారు దిగిరావాలని డిమాండ్ తో.. జూన్ 28వ తేదీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టినట్లు జేఏసీ చైర్మన్ కె. లక్ష్మయ్య తెలిపారు. జూలై 12న పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉన్న పెన్షనర్ల వెనక 30 లక్షల మంది ఓటర్లు ఉన్న సంగతి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స వర్తింపచేయాలని..పెన్షర్లకు బకాయి ఉన్న మూడు కరువు భత్యాల వాయిదాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షనర్ల సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేందుకు డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలన్నారు  జేఏసీ చైర్మన్.

పెన్షనర్లు భవన్ నిర్మాణం కొరకు పెన్షనర్ల కార్యాలయ నిర్వహణ కోసం హైదరాబాద్ లో వేయి చదరపు గజల స్థలం కేటాయించాలని కోరారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి... వైద్యులు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తదితర డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలని.. లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని పెన్షనర్లు హెచ్చరించారు.