కాంగ్రెస్​, బీజేపీని జనం నమ్ముతలె.. ఆ రెండు పార్టీలకు విజన్ లేదు: కేటీఆర్

కాంగ్రెస్​, బీజేపీని  జనం నమ్ముతలె.. ఆ రెండు పార్టీలకు విజన్ లేదు: కేటీఆర్
  • పోటీ పడి అర్రాస్ పాటలా హామీలిస్తున్నయ్: కేటీఆర్
  • దేశంలో తెలంగాణను మించిన మోడల్ ఉన్నదా?
  • అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినం.. ఫలితాలు వస్తున్నయ్
  • పదేండ్లలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినం
  • కాంగ్రెస్​ను నమ్మితే 50 ఏండ్లు వెనక్కే.. 
  • బీజేపీ బీసీ అధ్యక్షుడిని తొలగించి.. బీసీ సీఎం అంటున్నది 
  • మేడిగడ్డ బ్యారేజీ కుంగితే కాంగ్రెస్, బీజేపీ నేతలు సంబురాలు చేసుకున్నరు.. మీట్ ది ప్రెస్​లో మంత్రి మండిపాటు

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్, బీజేపీని జనం నమ్మడం లేదని బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. ఆ రెండు పార్టీలకు విజన్ అంటూ లేదని విమర్శించారు. ‘‘కేసీఆర్ కు ఎందుకు ఓటెయ్యాలి అంటే.. అందుకు నేను వెయ్యి కారణాలు చెప్తా. మేం రాష్ట్రానికి ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. కేంద్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్.. టెస్టెడ్, ట్రస్టెడ్ అండ్ డస్టెడ్ పార్టీ. ఆ పార్టీని ప్రజలు నమ్మి ఓట్లేసి.. చివరకు ఇక పనికి రాదని చెత్తబుట్టలో పడేశారు. ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ అర్రాస్ పాటలా హామీలు ఇస్తున్నాయి. పోటీ పడి హామీలు ఇవ్వడం తప్ప.. వాళ్లకు ఒక విజన్ అంటూ లేదు. ఆ పార్టీలను ప్రజలు నమ్మడం లేదు” అని అన్నారు. శనివారం హైదరాబాద్ లోని బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్​ది ప్రెస్​ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 

కాంగ్రెస్​ గ్యారంటీలను చూసి మోసపోతే, మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని కేటీఆర్​అన్నారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్​కు ఓటేసిన పాపానికి అక్కడి రైతులు చెంపలేసుకుంటున్నరు. కర్నాటక రైతులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్లు పెయిడ్​రైతులని కొందరు ఆరోపిస్తున్నరు. కర్నాటకకు వెళ్లి అక్కడ రైతుల పరిస్థితి ఎట్లుందో చూద్దాం.. అందుకు సిద్ధమా” అని సవాల్ విసిరారు. కర్నాటక మోడల్ ​కావాలా.. తెలంగాణ మోడల్​కావాలా అని ప్రశ్నించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఇష్టం లేకున్నా ఆంధ్రాతో కలిపి 58 ఏండ్లు గోసపడేలా చేసింది కాంగ్రెస్​పార్టీనే అని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి సోనియాగాంధీ మోసం చేయడంతోనే వందలాది మంది యువత బలిదానాలు చేసుకున్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని తుపాకీతో అణచి వేసింది కూడా కాంగ్రెస్​పార్టీనే. సిక్స్ పాయింట్ ఫార్ములాను నిలబెట్టుకోని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటున్నది. ఆ పార్టీని నమ్మితే ఇంకో 50 ఏండ్లు వెనక్కిపోవడం ఖాయం” అని అన్నారు. ‘‘మేం అభివృద్ధి రాజకీయాలను మాత్రమే కోరుకుంటాం. వాళ్లలా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుంటే పీసీసీ చీఫ్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు. రేపు ఏమైనా పోతాడేమో తెలియదు” అని కామెంట్ చేశారు. ‘‘సోనియాగాంధీ తనకు తానుగా తెలంగాణ ఇవ్వలేదు. ఏపీలో జగన్ పార్టీ పెట్టడంతో, అక్కడ కాంగ్రెస్ ఎలాగూ కూలిపోయిందని.. ఇక్కడైనా నాలుగు సీట్లు వస్తాయని తెలంగాణ ఇచ్చింది” అని అన్నారు. 

దేశానికే దిక్సూచిలా తెలంగాణ.. 

తొమ్మిదేండ్లలో దేశానికే దిక్సూచిలా తెలంగాణను తీర్చిదిద్దామని కేటీఆర్ చెప్పారు. ‘‘పార్లమెంట్ లో ముస్లిం ఎంపీపై దాడి జరుగుతోంది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే పరిస్థితి కల్పించాం. రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు” అని అన్నారు. ‘‘ కేసీఆర్ అప్పు చేసిన ప్రతి పైసా ప్రొడక్టివ్ సెక్టార్ లో ఖర్చు పెట్టారు. మిషన్ భగీరథ, కాకతీయ లాంటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడవి ఫలితాలు ఇస్తున్నాయి” అని చెప్పారు.
 
కులం కాదు.. గుణం ముఖ్యం

బీజేపీ బీసీ అధ్యక్షుడిని తొలగించి, ఇప్పుడు బీసీ సీఎం అంటోందని కేటీఆర్ విమర్శించారు. కులం ఏదన్నది ముఖ్యం కాదని, గుణం ముఖ్యమని అన్నారు. సోషల్ మీడియా అంటేనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని అన్నారు. ‘‘సర్వేలు, సోషల్​మీడియా ట్రెండ్స్.. మేం కూడా చేయగలం. కానీ ప్రజల స్పందన ఏమిటో నవంబర్ 30న తేలుతుంది. మా తలరాతలు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ఈ ట్రెండ్స్ కాదు.. ప్రజలే అసలు ఫలితం తేలుస్తారు” అని అన్నారు. జాతీయ పార్టీ అంటే ఎక్కడ ఎన్నికలు వచ్చినా పోటీ చేయాలని లేదు కదా అన్నారు. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ చేశాం. అలాంటప్పుడు సామాన్యులకు సీఎం దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంటుంది. కింది స్థాయిలో కావాల్సిన పని కోసం ఆదిలాబాద్​నుంచో అలంపూర్​ నుంచో సీఎం దగ్గరకు వస్తున్నారంటే, అది పబ్లిసిటీ స్టంటే” అని అన్నారు. 

కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్సే తెల్ల ఏనుగు

కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు అని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీనే దేశానికి నిజమైన తెల్ల ఏనుగు అని కేటీఆర్ విమర్శించారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగితే కాంగ్రెస్, బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో అన్నారం, మేడిగడ్డ పంపు హౌస్ లు మునిగితే కూడా ఇలానే చేశారు. కానీ ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా, వాటిని ఆయా ఏజెన్సీలతోనే రిపేర్ చేయించాం. ఇప్పుడు కూడా మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు ఏజెన్సీతోనే చేయిస్తాం. ప్రజలపై ఎలాంటి భారం పడదు” అని చెప్పారు.

రైతుబంధు తెచ్చిందే కేసీఆర్.. 

2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే... తమ ప్రభుత్వం పదేండ్లలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఇంకో 90 వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని తెలిపారు. విద్య, వైద్యం, అభివృద్ధిలో తెలంగాణను మించిన మోడల్ ఇంకేదైనా రాష్ట్రంలో ఉంటే చూపించాలి” అని సవాల్ విసిరారు. రైతుబంధు స్కీమ్ తెచ్చిందే కేసీఆర్ అని, తమ పథకాలనే కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టాయని ఫైర్ అయ్యారు.  

నిరుద్యోగులు 12 లక్షల మందే..

యువత అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. దేశ జనాభాలో 0.4 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నది నిజం కాదు. అన్ని రకాల గ్రూప్స్ పరీక్షలు రాసింది 12 లక్షల మంది మాత్రమే.     - 

కేటీఆర్

దళిత సీఎం అని చెప్పినం.. చెయ్యలె

2014కు ముందు దళిత సీఎం అని చెప్పి.. చేయలేకపోయాం. కానీ 2018లో కేసీఆరే సీఎం అని ఎన్నికలకు వెళ్లాం. ఇప్పుడు కూడా కేసీఆరే సీఎం అని ఎన్నికలకు పోతున్నాం. మమ్మల్ని విమర్శించేందుకు ఏమీ దొరక్క.. తొమ్మిదేండ్ల కిందటి హామీని ముందుకు తేవడంతో అయ్యేదేమీ లేదు. 

- కేటీఆర్