- ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణాల్లో జాప్యంతో తీరని కష్టాలు..
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పలు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని వాగులు దాటాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణాల్లో జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు.
ఇదీ పరిస్థితి..
పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ మీదుగా రేచింతల గ్రామానికి వెళ్లాలన్నా, పలు ఇతర గ్రామాలకు వెళ్లాలన్నా వరద నీటి ఉధృతి కారణంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కొన్ని రోడ్లను శాంక్షన్ చేసినప్పటికీ, బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ఏండ్ల తరబడి స్థానికులను వేధిస్తున్న ప్రధాన సమస్య అలాగే ఉంది. ఈ బ్రిడ్జిలు పూర్తయితే అటు ఆత్మకూరు, పెబ్బేరు మండలాల మధ్య దూరం తగ్గడంతో పాటు ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి.
* ఆత్మకూరు, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరైనప్పటికీ, కొన్ని చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
* పెద్దమందడి మండల కేంద్రం నుంచి వనపర్తికి వచ్చే దారిలో వడ్డేగేరి దాటాక, రాజనగరానికి వెళ్లే దారిలో అండర్ పాస్ కల్వర్టులున్నాయి. వర్షాలు వచ్చిన ప్రతి సారి వర్షపు నీరు పెద్ద ఎత్తున పారుతుండడంతో రాకపోకలు స్తంభించి పోతాయి. వనపర్తికి రావాలంటే చిట్యాల మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది.
* అల్వాల, పెద్దమందడి మధ్య ఉన్న కల్వర్టు వర్షపు నీటి ధాటికి రాకపోకలు నిలుస్తాయి.
* పెబ్బేరు చెలిమిళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 2013లో రూ.7.10కోట్లతో బ్రిడ్జి పనులు మొదలెట్టారు. గత కొన్నాళ్లుగా పనులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో ఈ వాగు దాటాలంటే యుద్దం చేసినంత పనవుతుంది. ప్రతి సారి వేసే అప్రోచ్ రోడ్డు కూడా వర్షానికి కొట్టుకుపోతుంది.
* పాన్గల్మండలంలో రేమద్దుల వద్ద వాగుమీద రోడ్డు కం బ్రిడ్జి కట్టారు. అది నిరుడు కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో పాన్ గల్, మాచిపల్లి, చెన్నారం, రేమద్దుల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈక్రమంలో వర్షాలు కురిసినప్పుడు వరద నీటి ప్రవాహంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండాలంటే హై లెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
