విల్లా ప్లాట్లపై మోజు!

విల్లా ప్లాట్లపై మోజు!

ప్రైవసీ, సెక్యూరిటీ ఉండటంతో ఇష్టపడుతున్న జనం 
 రెండేండ్లలో హైదరాబాద్​లో 60 ప్రాజెక్టులు

హైదరాబాద్​, వెలుగు: కారణమేదైనా కావొచ్చు.. జనం ఓపెన్​ ప్లాట్లకు బదులు విల్లా ప్లాట్లంటేనే ఇష్టపడుతున్నారు. భవిష్యత్​ కోసం వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలాంటి మౌలిక వసతుల్లేని ప్లాట్లను కొనడం కన్నా.. అన్ని సౌలతులండే గేటెడ్​ కమ్యూనిటీల్లోని లగ్జరీ విల్లా ప్లాట్లవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవసీ, సెక్యూరిటీ, క్లియర్​ టైటిల్​తో పాటు క్లబ్ హౌస్​, స్విమ్మింగ్​ పూల్​ వంటి అదనపు సౌలతులుండడం వల్ల కూడా విల్లా ప్లాట్లకు డిమాండ్​ పెరుగుతోంది. జస్ట్​ ఏడాదిలోనే విల్లా ప్లాట్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయి. దీంతో చిన్నాపెద్ద రియల్​ఎస్టేట్​ సంస్థలు కూడా ఎక్స్​క్లూజివ్​గా విల్లా ప్లాట్లను లాంచ్​ చేస్తున్నాయి.  
సాధారణ ప్లాట్ల కంటే ఎంతో భిన్నం
మామూలు ప్లాట్లతో పోలిస్తే విల్లా ప్లాట్ల ధర ఎక్కువే అయినా.. ఆ ప్లాట్లలో ఇచ్చే సౌలతులూ ఆ ధరకు తగ్గట్టుగానే ఉంటాయి. వీకెండ్​లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి సరదాగా గడిపేందుకూ ప్లాట్లలో సౌకర్యాలను అందిస్తున్నారు. ఓపెన్​ క్లబ్​హౌస్​, స్విమ్మింగ్​పూల్​, పార్టీజోన్​, జిమ్​, పచ్చదనం వంటి అదనపు హంగులను అద్దుతున్నారు. వీటితోపాటు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, కరెంట్​, ఓపెన్​ ఏరియా, ప్లాట్​ చుట్టూ పచ్చటి చెట్ల వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రియల్​ఎస్టేట్​ సంస్థలు విల్లా ప్లాట్​ కొన్నవారికి రిసార్ట్​ క్లబ్​ సభ్యత్వాన్నీ ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు ఐదారేళ్ల తర్వాత బై బ్యాక్​ ఫెసిలిటీ, రెంటల్​ఇన్​కం వచ్చేలా కమర్షియల్​ యాక్టివిటీ వంటి ఆఫర్లు ఇస్తున్నాయి.  
ఓఆర్​ఆర్​ చుట్టూ క్రేజ్​
సిటీ చుట్టూ ఉన్న ఔటర్​ రింగ్​ రోడ్​ (ఓఆర్​ఆర్​)కు 15–20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లోని స్థలాలు విల్లా ప్లాట్లకు అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్​కు ఆనుకుని ఉన్న మంచిరేవుల, నార్సింగి, శంషాబాద్​, బెంగుళూరు హైవే, ముత్తంగి, ఓఆర్​ఆర్​ గేట్​వేల్లో విల్లా ప్లాట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మామూలు ప్లాట్లతో పోలిస్తే విల్లా ప్లాట్ల ధరలు గజానికి రూ.10 వేలు ఎక్కువగానే ఉన్నా.. భవిష్యత్​ లో ఐదారు రెట్ల ధర వచ్చే అవకాశముందన్న ఆశాభావంతో చాలా మంది విల్లా ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫ్రీ లాంచింగ్​, నిర్మాణ దశలోనే ప్లాట్లకు అడ్వాన్సులూ కట్టేస్తున్నారు. బిల్డర్ల ట్రాక్​ రికార్డును బట్టి బ్యాంకర్లు లోన్లు ఇస్తున్నారు. దీంతో చాలా మంది విల్లా ప్లాట్లను కొనేస్తున్నారని రియల్టర్లు చెప్తున్నారు. 
గజం రూ. 25 వేలు
ఐటీ ఉద్యోగులు, కొత్తగా పెళ్లైన జంటలు, రిటైర్డ్​ ఉద్యోగులు, ఎన్నారైలు విల్లా ప్లాట్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ రెండేండ్లలోనే హైదారబాద్​లో 60కిపైగా విల్లా ఓపెన్​ ప్రాజెక్టులు మొదలయ్యాయి. 150 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో విల్లా ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. సిటీకి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని మామూలు ప్లాట్ల ధర గజానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల దాకా ఉంటుండగా.. ఈ విల్లా ప్లాట్లకు రూ.25 వేల దాకా ఉంటోంది. ఇప్పటికే ఓపెన్​ ప్లాట్లు వేసిన రియల్టర్లు.. మిగిలిన భూముల్లో విల్లా ప్లాట్లను నిర్మిస్తున్నారు. బడా కంపెనీలూ వీటిలో ఇన్వెస్ట్​ చేస్తున్నాయి. అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాల నిర్వహణ ఖర్చులు ఎక్కువైపోతుండడంతో.. తక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభాలు వస్తున్న ఈ విల్లా ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన సంస్థలే కాకుండా ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు చెందిన కంపెనీలూ వీటిలో ఇన్వెస్ట్​మెంట్లు పెడ్తున్నాయని రియల్​ఎస్టేట్​ వర్గాలు చెప్తున్నాయి.