భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 11మంది వర్షాల కారణంగా చనిపోయారు. నోయిడా, ఫిరోజాబాద్, లక్నోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బరేలి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. వరి పంట పూర్తిగా నేలమట్టం అయింది. తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటపై పెట్టుబడి పెట్టామన్నారు.

రాజస్తాన్ లో కూడా నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నిజలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. మొక్కజొన్న, సోయాబీన్ పంటలు 73 శాతానికి పైగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అధికారులు. టొంక్, బండి కోట జిల్లాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



మరోవైపు కర్ణాటకలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నడుం లోతు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.