రాజకీయ కోణంలోనే యూఎస్ టూర్కు అనుమతివ్వలే..రాష్ట్రానికి వచ్చాక.. అన్ని అంశాలు మాట్లాడతా: సీఎం రేవంత్

రాజకీయ కోణంలోనే యూఎస్ టూర్కు అనుమతివ్వలే..రాష్ట్రానికి వచ్చాక.. అన్ని అంశాలు మాట్లాడతా: సీఎం రేవంత్
  • తనకు అండగా నిలిచిన కాంగ్రెస్​ చీఫ్ ఖర్గేకు థ్యాంక్స్ 
  • లండన్ పర్యటన విజయవంతం
  • రాష్ట్రానికి వచ్చాక.. అన్ని అంశాలు మాట్లాడతానంటూ ఎక్స్​లో పోస్ట్​

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో బోస్టన్‌‌‌‌కు వెళ్లలేకపోతున్నానని చెప్పారు. లండన్‌‌‌‌లో తాము చేపట్టిన పర్యటన విజయవంతమైందన్నారు.

అక్కడ నిర్వహించిన అన్ని అధికారిక సమావేశాలు, షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు పూర్తయ్యాయని సీఎం ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తనకు, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీల నేతలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బోస్టన్ పర్యటన రద్దు కావడంతో కొన్ని గంటల్లోనే లండన్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌కు చేరుకున్న వెంటనే విదేశాంగ శాఖ నిర్ణయం, దానికి వెనుక ఉన్న రాజకీయం, పర్యటన వివరాలకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి సమాచారం వెల్లడిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. గత మూడు రోజులుగా లండన్‌‌‌‌లో తమకు లభించిన అపూర్వ మద్దతుకుగాను అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీవ్రంగా ఖండించిందని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తిస్తోందని, ఒక రాష్ట్ర సీఎం పర్యటనను ఇలా అడ్డుకోవడం దారుణమంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనకు కొండంత అండగా నిలిచారంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ లండన్ పర్యటన ముగించుకొని, అక్కడి నుంచి నేరుగా అమెరికాలోని బోస్టన్‌‌‌‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, విదేశాంగ శాఖ ఆయన పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించింది. దీంతో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న సీఎం.. అమెరికా వెళ్లకుండానే లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌‌‌‌కు తిరుగుపయనమయ్యారు.