బషీర్‌బాగ్, వెలుగు: ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించారని, ఆయనను కేవలం హిందుత్వవాదిగా ముద్ర వేయడం బహుజన చరిత్రకు జరిగిన తీవ్ర అన్యాయమని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు విమర్శించారు. గురువారం లక్డీకాపూల్‌లో జరిగిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. శివాజీ పాలనలోని సర్వమత సహనాన్ని, సంస్కరణలను కొందరు బ్రాహ్మణ నాయకులు, పీష్వాలు (చిత్పవన్ బ్రాహ్మణులు) ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచారని ఆరోపించారు.
1869లోనే శివాజీ సమాధిని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వెలికితీసి బహుజన చైతన్యాన్ని రగిలించారని గుర్తు చేశారు. బహుజన రాజులను ఆర్ఎస్ఎస్ హిందుత్వ ప్రతీకలుగా చూపించిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తమ వీరుల అసలు చరిత్రను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో టిప్పు సుల్తాన్ చరిత్రను కూడా వక్రీకరించారని, ఇప్పటికైనా బహుజన వీరుల చరిత్రను నిజాయితీగా పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
