హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ కేడర్ కు చెందిన పోస్టుల్లో ఐపీఎస్ కేడర్ అధికారులను నియమించడంపై పిటిషన్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ తరహా నియామకం వల్ల ఎవరైనా బాధితులు ఉన్నారా అని ప్రశ్నించింది. ఎవరైనా ఉంటే వాళ్లను ప్రతివాదులుగా చేర్చాలంది. ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ గతేడాది సెప్టెంబరు 28న ప్రభుత్వం వెలువరించిన జీవో 1342ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ వేసిన పిటిషన్ ను జస్టిస్ వేణుగోపాల్ శుక్రవారం విచారించారు.
క్యాడర్ నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమించడం చెల్లదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శిగా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కమిషనర్, ముఖ్యకార్యదర్శిగా శిఖాగోయల్, హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఆ విధంగానే పనిచేస్తున్నారని వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ..పిటిషన్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ప్రతివాదులను చేర్చాలంటూ విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
