వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా కేసు చెల్లదు..కేకే కొడుకు పెట్టిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా కేసు చెల్లదు..కేకే కొడుకు పెట్టిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌
  • భూమి క్రమబద్ధీకరణ కేసులో కొనసాగిన వాదనలు 

హైదరాబాద్, వెలుగు: సర్కారు భూమిని నామమాత్రపు ధరతో క్రమబద్ధీకరించడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిల్‌ను విత్​డ్రా చేసుకోవడానికి రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టుగా మాజీ ఎంపీ కేశవరావు కుమారుడు వెంకటేశ్వరావు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని, ఆ మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన జి.రఘువీర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. పిటి షనర్‌ తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వర రావు వాదనలు వినిపిస్తూ.. కేవలం వాట్సాప్‌ మెసేజ్‌ల ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. ఎలాంటి ఫోన్‌ కాల్‌ చేసి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. ఫిర్యాదు చేసినపుడు అందులో సరైన అభియోగాలు ఉండాలన్నారు.

అంతేగానీ, మెసేజ్‌లను చూసి, వాటిని ఊహించుకుని బెదిరించినట్లు కేసులు నమోదు చేస్తే చట్టం అనుమతించదన్నారు. పిల్​పై జరిగిన విచారణకు సంబంధించిన ప్రచురితమైన వార్తా కథనాన్ని పంపారని, పత్రికలో ప్రచురించిన అంశం పంపడం బెదిరింపు కాదని, అది బహిరంగ సమాచారమని తెలిపారు. భయపెడితే.. భయపడను ఇదే విషయాన్ని హైకోర్టులో చెబుతానన్న వాట్సాప్‌ మెసేజ్‌లో బెదిరింపు ఎలా ఉందన్నారు.

అదేవిధంగా పిటిషన్‌ పలానా సమయానికి విచారణకు వస్తుందన్న మెసేజ్‌ సమాచారం అయి ఉండవచ్చని, అందులో బెదిరింపు లేదన్నారు. ఒకవేళ అలా బెదిరించి ఉన్నట్లయితే ఆ తరువాతి రోజే మొదటి కోర్టు హాలులో జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తా వించి ఉండవచ్చన్నారు.  

వెంకటేశ్వరరావు తరఫు న్యాయ వాదులు ప్రభాకర్, కృష్ణకుమార్‌గౌడ్‌ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారుకు చెందిన భూమి క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై దాఖలు చేసిన పిల్‌ విత్ డ్రా చేసుకోవడానికి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారన్నారు. దీనికి వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లే ఆధారాలని చెప్పారు. ఎలాంటి పరిచయం లేని పిటిషనర్‌ ఫిర్యాదుదారుకు మెసేజ్‌లు పంపాల్సిన అవసరంలేదన్నారు. వాదనలు పూర్తికాకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు