ఐఏఎస్, ఐపీఎస్​ల కేటాయింపుపై హైకోర్టును కోరిన పిటిషనర్లు

ఐఏఎస్, ఐపీఎస్​ల కేటాయింపుపై హైకోర్టును కోరిన పిటిషనర్లు
  • పిటిషన్​వారీగా విచారించాలని వినతి
  • విచారణ జనవరి 2కు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించడంపై క్యాట్‌ ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఏఐఎస్ ఆఫీసర్లను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించవని వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణ మధ్య అధికారుల కేటాయింపు మరోసారి పరిశీలించాలని చెప్పింది. అలాగే పదేండ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న ఏపీ కేడర్​ఆఫీసర్లు, త్వరలో రిటైర్​అయ్యే వారికి సంబంధించి కేంద్రమే సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అయితే అలా వద్దని.. పిటిషన్‌ వారీగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్‌ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏఐఎస్‌ ఉద్యోగుల కేటాయింపు జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌ వివాదం కొనసాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఏపీకి కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై క్యాట్‌ ను ఆశ్రయించి.. తెలంగాణలో ఉండేలా ఆర్డర్లు పొందారు. క్యాట్‌ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే కేడర్, సర్వీస్‌ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహా వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమర్థించారు. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.