పెట్రోల్, డీజీల్ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ తగ్గడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి టాస్క్‌ఫోర్స్ కమిటీల ద్వారా మార్కెట్ ధరలను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపడంతోపాటు పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా రాయితీలను విస్తృతం చేయాలని ఎక్స్పర్ట్స్సూచిస్తున్నారు.
మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ.. ప్రాథమిక అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకోసం ‘టైట్ బడ్జెట్’ ప్లాన్ చేసుకోవాలంటున్నారు. భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఏర్పాటు చేసుకోవడం, బ్రాండెడ్ వస్తువుల కంటే నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడం, వైద్య ఖర్చుల భారం పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్‌లను ముందే సిద్ధం చేసుకోవాలంటున్నారు.
పెరిగిన మందుల ధరలు
సాధారణంగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న నిత్యావసర ప్రాణరక్షక మందుల గరిష్ట పరిమితి ధరలను ఫార్మా కంపెనీలు ఇష్టానుసారంగా పెంచడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. హోల్‌సేల్ ధరల సూచిక ఆధారంగా ఏడాదికి ఒకసారి మాత్రమే కంపెనీలు ధరలను సవరించుకునే చట్టపరమైన అనుమతి ఉంటుంది.
ఈ నిబంధనల ప్రకారమే కంపెనీలు అధికారికంగా సవరించిన కొత్త రేట్ల స్టాక్‌ను ఈ మే నెలలో మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే, ఈ వార్షిక ధరల పెంపునకు తోడు.. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరల వల్ల ఫార్మా కంపెనీల తయారీ యూనిట్ల నుంచి హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడ నుంచి రిటైల్ మెడికల్ షాపులకు మందులను చేరవేసే లోకల్ కొరియర్, ఏజెన్సీ రవాణా ఖర్చులు కూడా ఒక్కసారిగా భారం కావడం రిటైల్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.
ఈ రెండిటితో రిటైల్ మార్కెట్‌లో నెల రోజుల క్రితం రూ. 92.50 లు ఉన్న బీపీ మందుల (టెల్మిసార్టన్ 40 ఎంజీ ) 15 మాత్రల స్ట్రిప్ ధర కొత్త స్టాక్ వచ్చేసరికి రూ. 94కు చేరింది. అలాగే, రూ. 118గా ఉన్న షుగర్ కంట్రోల్ కాంబినేషన్ మాత్రల (గ్లిమిపిరైడ్ ప్లస్ మెట్‌ఫార్మిన్) స్ట్రిప్ ధర ఇప్పుడు రూ. 121.50కు ఎగబాకింది.
సాధారణ పారాసిటమాల్ 650 ఎంజీల మాత్రల స్ట్రిప్‌పై కూడా రూపాయిన్నర దాకా అదనపు భారం పడింది.
యాంటీబయాటిక్స్, వివిధ రకాల సిరప్‌ల కొత్త రేట్లు తోడవ్వడంతో, దీర్ఘకాలిక రోగాలు ఉండి నెలకు సరిపడా మందులు కొనుగోలు చేసే సగటు మధ్యతరగతి కుటుంబాలపై ఈ మే నెలలో నిశ్శబ్దంగా అదనపు ఆర్థిక భారం పడుతోంది.
