హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 732 ఫార్మసిస్ట్(గ్రేడ్–-2) పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాల విడుదలపై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. హైకోర్టులో కేసు పెండింగ్ ఉండటం వల్లే రిజల్ట్స్ ఆలస్యమవుతున్నాయని, తుది తీర్పు రాకముందే ఫలితాలు ప్రకటిస్తే నియామక ప్రక్రియ రద్దయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీ మార్కుల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని పేర్కొంది. కొందరు అభ్యర్థులు ప్రభుత్వ సర్వీస్‌లో ఉండి, ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనూ ఫార్మసిస్టులుగా రిజిస్టర్ అయ్యారని, వారికి వెయిటేజీ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని కోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు ఆపక తప్పడం లేదని వివరించింది.

