ఆగస్టు చివరిలో ఫోన్‌‌ట్యాపింగ్‌‌ ఛార్జ్‌‌షీట్‌‌

 ఆగస్టు చివరిలో  ఫోన్‌‌ట్యాపింగ్‌‌ ఛార్జ్‌‌షీట్‌‌
  • గత ప్రభుత్వంలోని ముగ్గురు పెద్దలపై అభియోగాలు
  • నిందితులుగా ఛార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేయనున్న సిట్‌‌
  • 600 మందికిపైగా స్టేట్‌‌మెంట్లు రికార్డ్‌‌ చేశాం: సజ్జనార్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జ్‌‌షీట్‌‌కు రంగం సిద్ధమైంది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వల్ల అంతిమ లబ్ధిదారులుగా అభియోగాలు మోపుతూ గత ప్రభుత్వ పెద్దల్లో ముగ్గురు ప్రముఖ నేతలను కూడా నిందితుల జాబితాలో చేర్చుతున్నట్టు సమాచారం. ఈ మేరకు 10 మంది నిందితులతో కూడిన ఫైనల్ ఛార్జ్‌‌షీట్‌‌ను ఈ నెలాఖరులోగా కోర్టులో దాఖలు చేయనున్నట్టు తెలిసింది.

ఈక్రమంలో దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని సిట్ చీఫ్‌‌, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆహార కల్తీల ముఠా అరెస్ట్‌‌ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎస్‌‌ఐబీ చీఫ్‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావడం ఆలస్యమైన కారణంగానే కేసు విచారణ ఆలస్యమైందన్నారు.

ట్యాపింగ్‌‌ నంబర్ల లిస్ట్‌‌ ఆధారంగా తెలంగాణ సహా ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, వ్యాపారవేత్తలు దాదాపు 600 మందికి పైగా స్టేట్‌‌మెంట్లను రికార్డ్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో కీలక సాక్షాధారాలన్నింటినీ నిందితులు ధ్వంసం చేసినట్టు స్పష్టం చేశారు. ఏపీకి చెందిన రాజకీయనేతలతో పాటు పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాప్‌‌ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

ఏపీకి చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొంత మందిని సాక్షులుగా స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ చేసినట్టు తెలిపారు. కేసు రికార్డుల పరిశీలన తుదిదశలో ఉన్నందున ఆగస్టు చివరి వారంలో ఛార్జ్‌‌షీట్ దాఖలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.