ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేసి ఆడియోలు బయటపెట్టారు

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేసి ఆడియోలు బయటపెట్టారు
  • ట్యాపింగ్‌‌‌‌ జరిగినట్లు నా వద్ద ఆధారాలు ఉన్నాయి
  • డీజీపీకి ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుడు నందు కుమార్‌‌‌‌ ఫిర్యాదు‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ / బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు:  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందు కుమార్ డిమాండ్‌‌‌‌ చేశాడు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌  జరిగిందని అతను ఆరోపించాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో తన ఫోన్‌‌‌‌ ట్యాప్‌‌‌‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో నందు కుమార్  మాట్లాడాడు. ఫోన్‌‌‌‌  ట్యాపింగ్‌‌‌‌ జరిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరానని తెలిపాడు. ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ కేసు సమయంలో తన ఫోన్  ట్యాప్  చేసినట్లు ఆడియో రికార్డులు ఉన్నాయని చెప్పాడు. ఎస్ఐబీ చీఫ్  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు ట్యాపింగ్  చేశారని, ఫోన్లు ట్యాప్  చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడిన సంభాషణలకు సంబంధించిన మూడు ఆడియోలు బయట పెట్టారని చెప్పాడు. టాస్క్‌‌‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌ రావు తనతో పాటు తన కుటుంబ సభ్యులు,స్నేహితుల్ని అక్రమంగా నిర్భందించి కేసులు పెట్టారని ఆరోపించాడు. తన స్నేహితుల్లో160 మందిని టాస్క్‌‌‌‌ఫోర్స్ ఆఫీసుకి తీసుకెళ్లి బలవంతంగా కేసులు పెట్టించి పీడీ యాక్ట్  ప్రయోగించాలని చూశారని పేర్కొన్నాడు.

ఆడియోలు ఎలా వచ్చాయో నిగ్గు తేల్చాలి

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ ద్వారా మూడు ఆడియో రికార్డులను బయటపెట్టారని నందు కుమార్  అన్నాడు. ఆ ఆడియోలు ఎలా వచ్చాయో నిగ్గుతేల్చాలని డీజీపీని కోరానని అతను తెలిపాడు. అప్పటి టాస్క్‌‌‌‌ఫోర్స్  డీసీపీగా ఉన్న రాధాకిషన్‌‌‌‌ రావు ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు చేశారో తెలియాల్సి ఉందన్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్రూవర్‌‌‌‌‌‌‌‌గా  మారినందుకు తన హోటల్‌‌‌‌ను ధ్వంసం చేశారని వాపోయాడు. ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించి డీజీపీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వెల్లడించాడు. ఎప్పుడు, ఎక్కడ ఫోన్  ట్యాపింగ్ జరిగిందో మొత్తం వివరాలు తెలియజేశానని చెప్పాడు. కోర్టు అదేశాలు ఉన్నా ఫిల్మ్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌‌‌‌ని కూల్చేస్తున్నారని, ప్రొడ్యూసర్  దగ్గుబాటి సురేష్  బాబు, నటుడు వెంకటేశ్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశానని  వెల్లడించాడు.