
జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ‘పింక్ క్యాబ్స్’ మొదలయ్యాయి. వాటిని మహిళలు, యువతుల కోసమే ప్రత్యేకంగా ఆ జిల్లా యంత్రాంగం స్టార్ట్ చేసింది. లేడీస్ ఇబ్బంది పడకుండా, వాళ్లను సేఫ్‌గా ఇంటికి చేర్చేందుకు గాను ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే (అక్టోబర్ 11)న ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఈ ఏర్పాట్లు చేసింది. మొదట 8 సీట్ల 6 మహీంద్రా సుప్రో వ్యాన్లను స్టార్ట్ చేసింది. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, పాత బస్టాండ్ నుంచి ఖాండ్లీకి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఈ క్యాబ్‌లు నడుస్తాయి. మహిళలు, గర్ల్ స్టూడెంట్లు సురక్షితంగా, ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి ఈ పింక్ క్యాబ్‌లను తీసుకొచ్చినట్టు జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ మహ్మద్ ఐజాజ్ అసద్ తెలిపారు. ‘సాధారణ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో ఎక్కువ జనం ఉండటం వల్ల మహిళలు, యువతులు ఇబ్బంది పడుతుండటం కనిపించింది. అందుకే ఈ క్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం’ అన్నారు. మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ సర్వే చేశాకే ఆ రూట్లను ఎంచుకున్నామన్నారు. ఈ సర్వీసులను వాడుకోవాలని కోరారు. మహిళలు, యువతుల కోసం ఇలాంటి కొత్త కొత్త సదుపాయాలు మరిన్ని తీసుకొస్తామని చెప్పారు.