కామర్స్ ఉన్నట్టా ? లేనట్టా ? రిజల్ట్స్ బాగున్నా CEC, HEC గ్రూపులను తొలగించే ప్లాన్!

కామర్స్ ఉన్నట్టా ? లేనట్టా ? రిజల్ట్స్ బాగున్నా CEC, HEC గ్రూపులను తొలగించే ప్లాన్!
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్యాయం జరుగుతోందన్న పేరెంట్స్
  • ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాయమైన కాలేజీల పేర్లు
  • తాజగా విద్యార్థి సంఘాల ఆందోళనతో కొన్నిచోట్ల సర్దుబాటు
  • తొలగించిన అన్నిచోట్ల గ్రూపులను పునరుద్ధరించాలని డిమాండ్

నల్గొండ, వెలుగు: మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కామర్స్ క్లోజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొత్త గ్రూపులను ప్రోత్సహిస్తుంటే, అధికారులు మాత్రం ఉన్న గ్రూపులకే మంగళం పాడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 14 గురుకుల కాలేజీల్లో సీఈసీ, హెచ్​ఈసీ గ్రూపులను తొలగించాలని చూడడంపై అభ్యర్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 100 శాతం రిజల్ట్స్ వస్తూ, స్టేట్ ర్యాంకులు సాధిస్తున్నా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

సక్సెస్ ఉన్నా కానీ..
గతేడాది ఫలితాల్లో మోటకొండూరు గర్ల్స్ కాలేజీ 100 శాతం మార్కులతో స్టేట్ ర్యాంకులు సాధించింది. మల్లెపల్లి గర్ల్స్, దేవరకొండ బాయ్స్ కాలేజీలు కూడా అద్భుతమైన ఫలితాలు నమోదు చేశాయి. నేరేడుచర్ల వంటి కాలేజీల్లో ప్రభుత్వ లెక్చరర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ గ్రూపులను తొలగించాలని చూడడం విడ్డూరంగా ఉంది.

అందరూ ఎంపీసీ, బీపీసీలే చదివితే.. కామర్స్ చదివే వారు వద్దని అధికారులు భావిస్తున్నారా? మరి ఆ విద్యార్థుల పరిస్థితేంటి? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బుధవారం వరకు ఎంజేపీటీ  బీసీడబ్ల్యూఆర్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో నల్గొండ జిల్లాకు సంబంధించి గర్ల్స్ కాలేజీల్లో కేవలం అనంతగిరిలో తప్ప ఎక్కడా సీఈసీ ఆప్షన్ చూపించడం లేదు.

బాయ్స్ విభాగంలో నాగారం, మూసి, నాగార్జున సాగర్ మినహా మిగతా కాలేజీల పేర్లు మాయమయ్యాయి. దీంతో వేలాది మంది విద్యార్థినులు అప్లై చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై విద్యార్ది సంఘ నాయకులు బుధవారం నల్గొండ ఆర్సీవో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీంతో మరుసాటి రోజు కొన్నిచోట్ల కొన్ని సీట్లు సర్దుబాటు చేసే ప్రయత్నం జరిగింది. కాగా, తొలగించిన అన్నిచోట్ల  గ్రూపులను పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాల లీడర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు. 

‘సీఈసీ, హెచ్ఈసీ’లకు మస్తు డిమాండ్.. 
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీపీసీ, ఎంపీసీలతో పాటు సీఈసీ, హెచ్ఈసీలకూ బాగా డిమాండ్ ఉంది. అయినా ఈ కోర్సులను వదిలేసి కేవలం బీపీసీ, ఎంపీసీలకే  ప్రచారం చేయడం వెనుక అడ్మిషన్ల కోసం భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 గర్ల్స్ కాలేజీల్లో  కేవలం 80 మాత్రమే సీఈసీ సీట్లను కేటాయించగా,  వీటిలో 40 సీట్లను మాత్రమే మాత్రమే భర్తీ చేశారు.

గతేడాది 100 శాతం రిజల్స్తో పాటు స్టేట్ ర్యాంక్ వచ్చిన మోటకొ౦డురు, మల్లేపల్లి కాలేజీలో ఏకంగా సీఈసీ, హెచ్ఈసీ కోర్సులను ఎత్తేశారు. 15 బాయ్స్ కాలేజీలలో  500 సీట్లు ఉండాల్సి ఉండగా, ఆన్ లైన్ లో మాత్రం  కేవలం మూడు కాలేజీల్లో 220కి సీట్లు తగ్గించి 150 సీట్లను మాత్రమే భర్తీ చేశారు. అయితే విద్యార్ది సంఘాల ఆందోళన నేపథ్యంలో మరో రెండు కాలేజీలను ఆన్ లైన్ లో లేకుండానే 70 సీట్లను భర్తీ చేశారు. కాగా, ఈ విషయమై ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్సీవో స్వప్నను వివరణ కోరేందుకు ఫోన్​ద్వారా ప్రయత్నించగా ‘గ్రూపులను తొలగించలేదు’ అని వెంటనే ఫోన్​కట్​ చేయడం గమనార్హం. 

ఆన్ లైన్ లో కనిపించడం లేదు 
చార్టెడ్ అకౌంటెంట్​పై ఆసక్తితో  మోటకొండూరు కాలేజీలో సీఈసీ గ్రూపులో చేరేందుకు ప్రయత్నించగా కనిపించడం లేదు. గతేడాది ఇదే కాలేజీలో మా బంధువు రాష్ట్ర స్థాయిలో పాస్ అవ్వగా,  ఇప్పుడు ఈ కాలేజీ లో అసలు గ్రూప్ లేదని చెప్తున్నారు. ఈ కోర్సును వెంటనే మోటకొండూరు కాలేజీలో ప్రభుత్వం పునరుద్ధరించాలి.

ప్రతిభ, ఆలేరు

ప్రైవేట్ లో చదివించే స్థోమత లేదు.. 
బయట ప్రైవేట్ కాలేజీలలో చదివించే స్తోమత లేక గురుకులల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని భావించి అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే గ్రూప్ లేవని చెప్తున్నారు. కనీసం ఎంపీసీ, బైపీసీ గ్రూపులో అయినా అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తే లేదని తిప్పి పంపిస్తున్నారు.

జనార్ధన్, మల్లేపల్లి

అన్నీ గ్రూపులను ప్రవేశపెట్టాలి
వాణిజ్య రంగానికి ఎంతగానో ఉపయోగపడే సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులను తొలగించడం సరికాదు. వెంటనే అన్నీ గ్రూపులు ప్రవేశపెట్టి స్పాట్ అడ్మిషన్లు ఇవ్వాలి.

బారీ అశోక్, విద్యార్ది సంఘం నాయకుడు