ఆస్ట్రేలియాలో టెంపుల్స్​పై దాడులు సహించం..  ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ

ఆస్ట్రేలియాలో టెంపుల్స్​పై దాడులు సహించం..  ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ
  • ఆస్ట్రేలియాలో టెంపుల్స్​పై దాడులు సహించం..  ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ
  • అలాంటి వ్యక్తులపైనా ఇకపై కఠిన చర్యలు: అల్బనీస్  
  • ద్వైపాక్షిక అంశాలపై సిడ్నీలో ఇద్దరు ప్రధానుల భేటీ  
  • పలు ఒప్పందాలపై సంతకాలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఖలిస్తాన్ అనుకూల శక్తుల యాక్టివిటీస్​ను కూడా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. టెంపుల్స్​పై దాడులుచేసే వ్యక్తులపై, ప్రో ఖలిస్తాన్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఇకముందు కఠినంగా వ్యవహరిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. బుధవారం సిడ్నీలో ఇరు దేశాల ప్రధానులు సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. టెంపుల్స్​పై దాడులు, ప్రో ఖలిస్తానీ యాక్టివిటీస్ విషయాన్ని అల్బనీస్​తో గతంలోనూ, ఇప్పుడూ ప్రస్తావించానని మోడీ చెప్పారు. ‘‘ఇండియా, ఆస్ట్రేలియా సంబంధాలను దెబ్బతీసే శక్తుల చర్యలను లేదా ఆలోచనలను కూడా మేం సహించబోం. ఈ విషయంలో ఇదివరకు తీసుకున్న చర్యలకు గాను ప్రధాని అల్బనీస్​కు నేను థ్యాంక్స్ చెప్తున్నా. భవిష్యత్తులోనూ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హామీ ఇచ్చారు” అని మోడీ తెలిపారు. 

‘టీ-20’ మోడ్​లోకి ఇరుదేశాల రిలేషన్స్ 

ఇండియా, ఆస్ట్రేలియా సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయని, క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇరుదేశాల రిలేషన్స్ ఇప్పుడు ‘టీ–20’ మోడ్​లోకి ప్రవేశించాయని మోడీ చెప్పారు. ‘‘నా ఫ్రెండ్ అల్బనీస్ ఇండియా సందర్శించిన 2 నెలల తర్వాత ఆస్ట్రేలియా వచ్చాను. ఏడాదిలో ఆరు సార్లు కలుసుకున్నాం. ఇది మన రెండు దేశాల స్నేహ సంబంధాల లోతును సూచిస్తుంది” అని అన్నారు. ‘‘అక్టోబర్​లో క్రికెట్ వరల్డ్ కప్​కు ఆతిథ్యం ఇస్తున్నాం. మ్యాచ్​లు చూసేందుకు అల్బనీస్, ఆస్ట్రేలియా అభిమానులను ఇండియా రావాలి” అని మోడీ పిలిచారు.

పలు ఒప్పందాలపై సంతకాలు 

ఇండియా–ఆస్ట్రేలియా ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం నిరుడు అమలులోకి వచ్చిందని, ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మోడీ చెప్పారు. ఈ ఒప్పందంపై కసరత్తును ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని అల్బనీస్ వెల్లడించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం భద్రత, సుసంపన్నత కోసం కలిసి పని చేయాలని, అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలపై కూడా సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నామని మోడీ తెలిపారు. అలాగే రెండు దేశాల మధ్య స్టూడెంట్లు, అకడమిక్ రీసెర్చర్లు, వ్యాపారవేత్తల రాకపోకలను ప్రోత్సహించడంతో పాటు అక్రమ వలసలను నివారించేందుకు వీలుగా ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్ నర్షిప్’ ఒప్పందంపై ఇద్దరు ప్రధానుల  సమక్షంలో సంతకాలు జరిగాయి.  

బెంగళూరులో ఆస్ట్రేలియన్ కాన్సులేట్: అల్బనీస్ 

బెంగళూరులో కొత్తగా ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్​ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఇండియాలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఎకానమీ, ఇన్నోవేషన్ ఎకో సిస్టంతో ఆస్ట్రేలియా కంపెనీలను కనెక్ట్ చేసేందుకు ఇది  బాగా ఉపయోగపడుతుందన్నారు.

మువ్వన్నెల్లో మెరిసిన  సిడ్నీ బ్రిడ్జి, ఒపెరా హౌస్   

సిడ్నీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిడ్నీ హార్బర్ బ్రిడ్జి, ఒపెరా హౌస్ ను బుధవారం సాయంత్రం ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తో కలిసి ప్రధాని మోడీ సందర్శించారు. మోడీ రాక సందర్భంగా హార్బర్ బ్రిడ్జి, ఒపెరా హౌస్ మన జెండా రంగుల్లో మెరిసిపోయేలా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. 

ఇండియా బయల్దేరిన మోడీ  

ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని బుధవారం ఇండియాకు బయలుదేరారు. శుక్రవారం జపాన్ లోని హిరోషిమాలో జీ7 దేశాల సమిట్ కు వెళ్లిన ఆయన అక్కడే క్వాడ్ దేశాల(ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్) సదస్సులోనూ పాల్గొన్నారు. అనంతరం సోమవారం పపువా న్యూ గినియాకు చేరుకున్న మోడీ..  ఇండియా–పసిఫిక్ ఐలాండ్ దేశాల సదస్సులో మాట్లాడారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రధాని వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో వేలాది మంది భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మోడీ మాట్లాడారు. పలు రంగాల ప్రముఖులతో పాటు ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత పీటర్ డ్యూటన్ తో భేటీ అయ్యారు. ఇండియాతో సంబంధాల విషయంలో దేశంలోని అధికార, ప్రతిపక్షాలు ఒకే మాటకు కట్టుబడి ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. మోడీతో సమావేశం కావడం పట్ల సంతోషంగా  ఉందని డ్యూటన్  ట్వీట్ చేశారు.