- మన సాయుధ దళాలు తమ పరాక్రమాన్ని ప్రదర్శించాయి: ప్రధాని మోదీ
- ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్మీని ప్రశంసిస్తూ ఎక్స్‌లో పీఎం పోస్ట్
- తన సోషల్ మీడియా ఖాతాలలోని డీపీలలో ఆపరేషన్ సిందూర్ లోగో
- సోషల్ మీడియా డీపీలు మార్చిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: ఏడాది క్రితం ఆపరేషన్ సిందూర్ ద్వారా టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన సాయుధ దళాలు తమ పరాక్రమాన్ని ప్రదర్శించి.. టూరిస్టులపై దాడి చేసిన వారికి గట్టి గుణపాఠం చెప్పాయని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన సోషల్ మీడియా ఖాతాలలోని డీపీలలో ఆపరేషన్సిందూర్ లోగోను పెట్టారు. అలాగే, సాయుధ దళాల ధైర్యసాహసాలకు, వారి విజయానికి గౌరవ సూచికగా ప్రతి ఒక్కరూ తమ డీపీలను మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాని పిలుపుతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు ఇతర పార్టీ నేతలు కూడా తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చుకున్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ చానల్స్‌లో బ్లాక్కలర్ బ్యాక్‌గ్రౌండ్‌పై ‘Operation Sindoor’ అని రాసి ఉన్న కొత్త లోగోను డీపీగా పెట్టుకున్నారు. ఇందులో త్రివర్ణ పతాకం రంగులతో పాటు, 'SINDOOR' అనే పదంలోని ‘O’ అక్షరాన్ని వివాహిత హిందూ మహిళల చిహ్నమైన ‘సింధూరం’ (కుంకుమ)తో నింపారు.
‘ప్రతి భారతీయుడు మన సైన్యం పట్ల గర్విస్తున్నాడు’ అని ఆయన ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌లో 25 మంది హిందూ పర్యాటకులు, ఒక టూరిస్ట్ గైడ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. గత ఏడాది మే 7 నుంచి 10 వరకు పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్ వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ అటాక్‌లో వంది మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.
జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నం: రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో ప్రొఫైల్ ఫొటోను అప్‌డేట్ చేస్తూ.. ఆపరేషన్ సిందూర్ జాతీయ సంకల్పానికి, సంసిద్ధతకు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన బలగాలు ఆధునిక సైనిక కార్యకలాపాలకు ఒక బెంచ్‌మార్క్ ను నెలకొల్పాయన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం సందర్భంగా మన సాయుధ దళాల శౌర్యానికి, త్యాగాలకు వందనం చేస్తున్నాం. వారి ధైర్యం, అంకితభావం దేశాన్ని కాపాడుతూనే ఉన్నాయి’ అని ఆయన రాసుకొచ్చారు.
దేశం ఆత్మగౌరవానికి ప్రతీక: నబిన్
ఆపరేషన్ సింధూర్ దేశం ఆత్మగౌరవం, న్యాయం, అచంచలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని బీజేపీ అధ్యక్షుడు నబిన్ అన్నారు. ‘మన సోదరీమణుల సిందూరం తుడిచివేసిన ఆ ఉగ్రవాదులను.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన ఆర్మీ వారిని మట్టిలో కలిపివేసింది. ప్రతి అన్యాయానికి ఎలా గట్టి సమాధానం ఇవ్వాలో కొత్త భారతదేశానికి తెలుసనే స్పష్టమైన సందేశాన్ని పంపింది’ అని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
శంకర్ కూడా తన ప్రొఫైల్
చిత్రాన్ని మార్చుకుని.. తన టైమ్‌లైన్‌లో ఆపరేషన్ సిందూర్ లోగో ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి, జలశక్తి శాఖ మంత్రి సీఆర్. పాటిల్ కూడా తమ ప్రొఫైల్ ఫొటోలను అప్‌డేట్ చేసుకున్నారు.
భారతదేశపు చరిత్రాత్మక మిషన్: హోం మంత్రి అమిత్‌షా
ఆపరేషన్ సిందూర్ భారతదేశపు చరిత్రాత్మక మిషన్‌గా నిలుస్తుందని హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది మన సాయుధ దళాల అమోఘమైన దాడి శక్తిని మన శత్రువులకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. సరిహద్దు అవతల ఉన్న ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడానికి, మన సాయుధ దళాల కచ్చితమైన దాడులు, మన ఏజెన్సీల నిశితమైన నిఘా, దృఢమైన రాజకీయ సంకల్పం ఏకమై నిలిచిన రోజుగా చరిత్ర దీనిని గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే భయంకరమైన సందేశాన్ని మన శత్రువులకు అందిస్తూనే ఉంటుందన్నారు. ‘మన దళాల అసమానమైన శౌర్యానికి నేను వందనం చేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
