95వ ఏట అడుగుపెట్టిన అద్వానీ

95వ ఏట అడుగుపెట్టిన అద్వానీ

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్​కే అద్వానీ 95వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం ఆయన బర్త్​డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ నాయకులు విషెస్​ చెప్పారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్..​ అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ కుమార్తె ప్రతిభ ప్రధానికి స్వాగతం పలికారు. అద్వానీ నివాసంలో మోడీ 30 నిమిషాల పాటు గడిపారు. పలు అంశాలపై ఇరువురూ ముచ్చటించారు. అద్వానీతో గడిపిన ఫొటోలను పోస్ట్​ చేస్తూ ప్రధాని మోడీ ఓ ట్వీట్​ చేశారు.

జాతీయ శక్తిగా బీజేపీ ఎదగడంలో అద్వానీ కృషి మరువలేనిదని, దేశాభివృద్ధిలోనూ ఆయన పాత్ర అనిర్వచనీయమైనదని మోడీ కొనియాడారు. తన విజన్, విజ్ఞానంతో అన్ని వర్గాల నుంచి గౌరవం పొందిన వ్యక్తి అద్వానీ అని అన్నారు. బీజేపీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మోడీ ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ నిరంతర శ్రమతో దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేశారని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ దేశాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. అద్వానీ తన జీవితాన్ని దేశం కోసం, పార్టీ కోసం అంకితం చేశారని, అది తమకు స్ఫూర్తిగా నిలుస్తోందని బీజేపీ జాతీయ 
అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.