నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలకు ప్రధాని మోడీ ఫోన్

నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలకు ప్రధాని మోడీ ఫోన్

న్యూఢిల్లీ:  నేపాల్‌‌కు మద్దతు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ దేశంలో స్థిరత్వం, శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుశీలా కర్కీతో మోదీ గురువారం ఫోన్‌‌లో మాట్లాడారు. ఇటీవల నేపాల్ లో జరిగిన నిరసనల్లో మృతిచెందిన యువతకు సంతాపం తెలిపారు. 

అలాగే, నేపాల్‌‌ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీలకు, నేపాల్‌‌ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సుశీలా కర్కీతో హృదయపూర్వక సంభాషణ జరిగిందని మోదీ ట్వీట్‌‌ చేశారు. కాగా, నేపాల్‎లో ఇటీవల సోషల్‌‌ మీడియా బ్యాన్‌‌తో మొదలైన నిరసనలు దేశవ్యాప్త ఉద్యమంగా మారడంతో ప్రధాని కేపీ ఓలీ శర్మ సహా మంత్రులు రిజైన్‌‌ చేశారు. ఆపై సుశీలా కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె సిఫార్సు మేరకు రద్దయిన నేపాల్‌‌ పార్లమెంటుకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.