V6 News

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ సేఫ్గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నా: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ సేఫ్గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నా: ప్రధాని మోదీ
  • కాల్పులను ఖండించిన దేశాధినేతలు. 
  • ట్రంప్ ఫ్యామిలీకి పూర్తి మద్దతు: మాక్రాన్
  • రాజకీయ ద్వేషానికి ప్లేస్ లేదు: మెలానీ

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  హాజరైన డిన్నర్  పార్టీలో కాల్పుల ఘటనపై ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. కాల్పులను ముక్తకంఠంతో ఖండించారు. కాల్పుల్లో ట్రంప్, ఆయన ఫ్యామిలీతో పాటు మిగతా వారందరూ సేఫ్​గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నానని భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో తెలిపారు. 

‘‘కాల్పులను పూర్తిగా ఖండిస్తున్నా. ట్రంప్, వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్, వారి కుటుంబాలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనను అందరూ ఖండించాలి” అని మోదీ పేర్కొన్నారు. కాల్పుల వార్త విని షాక్  అయ్యామ బ్రిటన్  ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్  అధ్యక్షుడు ఎమ్మానుయేల్  మాక్రాన్  అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై హింసకు చోటు లేదని వారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

ట్రంప్, జేడీ వాన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు తమ పూర్తి మద్దతు ఉందని ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్వేషానికి చోటు లేదు. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని మతమౌఢ్యులు పాడుచేయలేరు. అలా జరగకుండా అన్ని దేశాలు చూసుకోవాలి” అని మెలానీ ‘ఎక్స్’ లో వ్యాఖ్యానించారు. 

  • ప్రజాస్వామ్య దేశాలన్నిటిపైనా దాడి అది

కాల్పుల ఘటనను ‘డిస్టర్బింగ్ ఈవెంట్’ గా కెనడా ప్రధాని మార్క్  కార్నీ అభివర్ణించారు. ట్రంప్  డిన్నర్  కార్యక్రమంలో కాల్పుల వార్త విని షాక్ కు గురయ్యానని పాకిస్తాన్  ప్రధాని షెహబాజ్  షరీఫ్​ అన్నారు. కాల్పుల్లో అందరూ సేఫ్ గా బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నానని ఎక్స్ లో ఆయన ట్వీట్  చేశారు. 

కాల్పులు డిన్నర్  కార్యక్రమంపై మాత్రమే దాడి కాదని, అన్ని ప్రజాస్వామ్య దేశాలపైనా దాడి అని ఇజ్రాయెల్  అధ్యక్షుడు బెంజమిన్  నెతన్యాహు పేర్కొన్నారు. ‘‘అది ట్రంప్ పై మాత్రమే జరిగిన దాడి కాదు. అమెరికాతో పాటు అన్ని  ప్రజాస్వామ్య దేశాలపైనా దాడి” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. కాల్పుల నుంచి కాపాడిన సీక్రెట్  సర్వీస్  ఏజెంట్లందరినీ మెచ్చుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంతొనీ ఆల్బనీస్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే రిపబ్లిక్  ఆఫ్ కొరియా అధ్యక్షుడు లీ జే యుంగ్, జపాన్  ప్రధాని సనేయి తకైచి, మెక్సికో ప్రెసిడెంట్  క్లాడియా షీన్ బామ్  కాల్పులను ఖండించారు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని వారు పేర్కొన్నారు.