కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేదు

కాంగ్రెస్  కుటుంబ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేదు
  • ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీ
  • మా కూటమిలో చేరాలనుకునే పార్టీలకు స్వాగతం
  • వచ్చే ఎన్నికల్లోనూ తమదే అధికారమని ధీమా

న్యూఢిల్లీ: కాంగ్రెస్  వారసత్వ రాజకీయాల వల్లే ఎన్సీపీ చీఫ్​ శరద్  పవార్  ప్రధాని కాలేకపోయారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్  అహంకార పార్టీ అని ఆయన విమర్శించారు. బీజేపీ మాత్రం అందరినీ గౌరవించే పార్టీ అని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెందిన మహారాష్ట్ర  ఎంపీలతో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా 2014లో నాటి రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీతో జరిగిన తన భేటీ గురించి ఆయన గుర్తుచేశారు. ‘‘బీజేపీ నిన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిందని ప్రణబ్   నాతో అన్నారు. 

మొదటిసారి అలా జరిగిందని, అప్పటి వరకూ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని ఆయన చెప్పారు. గతంలో ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించి విజయం సాధించిన దాఖలాలు లేవని ప్రణబ్  తెలిపారు”  అని మోదీ వెల్లడించారు. అలాగే ఉద్ధవ్  ఠాక్రే వర్గానికి చెందిన శివసేనపైనా ఆయన విమర్శలు చేశారు. శివసేనే తమతో విభేదించి విడిపోయిందని, ఆ పార్టీతో తాము తెగతెంపులు చేసుకోలేదని  చెప్పారు. ‘‘గతంలో మా ప్రభుత్వంలో శివసేన భాగంగా ఉంది. అదే టైంలో వారు తమ పత్రిక సామ్నాలో మా ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు చేశారు. ఒకవైపు అధికారం పంచుకుంటూనే మరోవైపు విమర్శలు ఎలా చేస్తారు?” అని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏలో చేరాలనుకునే పార్టీలకు స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వారసత్వ రాజకీయలతోనే అవినీతి పెరుగుతోంది: రవిశంకర్ ప్రసాద్​

'క్విట్ ఇండియా' స్ఫూర్తితో  దేశాన్ని వారసత్వ, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్విట్ ఇండియా తరహాలోనే బీజేపీ బుధవారం నుంచి ఫ్యామిలిజం క్విట్ ఇండియా, కరప్షన్ క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా నినాదాలతో ముందుకు వెళుతుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అవినీతిని పెంచుతున్న ఈ 3 శాపాలు ఇండియాను వీడిపోవాల్సిందే అన్నారు. కుటంబ పాలన దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. అర్హత లేకున్నా వారసత్వంగా  కొందరు సీఎం, పీఎం అవుతున్నారని ఆరోపించారు.  ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే నేతలు కుటుంబ రాజకీయాల ను ముందుకు తీసుకువెళుతున్నారని విమర్శించారు. వారసత్వ రాజకీయం అప్రజాస్వామికం, బాధ్యతారహితమైనదని..అది ఉన్న చోట అవినీతి రాజ్యమేలుతుందని స్పష్టం చేశారు.