
తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అన్ని పథకాలు.. కేసీఆర్ కుటుంబానికి ATMల్లా పని చేస్తున్నాయని.. అవినీతి పెరిగిందంటూ తీవ్రంగా మండిపడ్డారు ప్రధానమంత్రి మోదీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నవంబర్ 25వ తేదీ కామారెడ్డిలో బీజేపీ ఎన్నికల సభలో పాల్గొన్నారు మోదీ. దళిత సీఎం అని చెప్పి.. సీఎం సీటును కబ్జా చేశారని కేసీఆర్ ను విమర్శించారు. బీజేపీ తరపున మోదీ గ్యారెంటీ ఇస్తు్న్నారని.. బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు బీసీ సీఎం వస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణలో మాదిగలకు సరైన న్యాయం జరగటం లేదని.. బీజేపీ ఆధ్వర్యంలో సముచిత స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చారు మోదీ
కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని.. అవినీతి పెరిగిందన్నారు మోదీ. సామాజిక సాధికారత కోసం ప్రయత్నిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు మోదీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పేపర్ల లీకులతో విద్యార్థులను మోసం చేసిందని.. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడి.. ప్రజలను వంచించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు మోదీ.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని.. రెండు పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. వాళ్ల మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు మోదీ. ముద్ర రుణాలు, గ్యారెంటీ కార్డులు, రైతులకు డబ్బులు ఇవ్వటం, ఐదు కిలోల ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లకు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు మోదీ. దేశంలో బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు ఎంపీని గెలిపించిన చరిత్ర తెలంగాణది.. అలాంటి తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు మోదీ. కామారెడ్డి ప్రజలు బీజేపీకి ఓటు వేసి.. బీసీని ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను కోరారు.
మోదీ సభలో.. పదే పదే నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రస్తావించటం విశేషం.